Minister Lokesh : పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్
తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు...
Minister Lokesh : సాక్షిపై వేసిన పరునాష్టం దావా కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘ చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సాక్షిపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరగనుంది. ‘ చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిపత్రికలో అసత్యాలు, కల్పితాలతో ఓ స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని నారా లోకేష్(Minister Lokesh) అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
Minister Lokesh Attend
అయితే దీనిపై సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్(Minister Lokesh) పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు.
వాస్తవానికి వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. ఇది సర్వసాధారణం. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ సైతం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి టీ, కాఫీ, స్నాక్స్ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఒక నిరాధార కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై అప్పట్లోనే నారా లోకేష్ మండిపడ్డారు. నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించాలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు లోకేష్ కోర్టుకు హాజరుకానున్నారు.
Also Read : Assam Train Accident : అస్సాం లో పట్టాలు తప్పిన అగర్తల-లోకమాన్య తిలక్ రైలు