Minister Nara Lokesh : కార్యకర్త మృతిపై భావోద్వేగ ట్వీట్ చేసిన మంత్రి లోకేష్

నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలని అనిపించలేదా?...

Nara Lokesh : టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మృతిపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చేవాడని, కానీ తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ లోకేశ్ మనోవేదనకు గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడి పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావంటూ ఆయన బాధపడ్డారు. శ్రీను ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకుని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందని, అంతేగానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా విచారకరమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా తన బాధను తెలియజేస్తూ ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్(Nara Lokesh) ట్వీట్ చేశారు.

Minister Nara Lokesh Tweet

“అన్నా..అన్నా… అని పిలిచేవాడివి. ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే వాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను పండగలా నిర్వహించేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలని అనిపించలేదా?. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను.. నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు.. కానీ నీ కుటుంబానికి నేనున్నా. నీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ బాధ్యతల్ని నెరవేరుస్తా.

తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఇదే నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్య ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు వంటి వారితో షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు” అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు.

Also Read : CM Revanth Reddy : ప్రధాని మోదీ, కేసీఆర్ కు ఓ పెద్ద సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!