Minister Nara Lokesh: పార్వతీపురం విద్యా శాఖ అధికారులపై మంత్రి లోకేష్ సీరియస్
పార్వతీపురం విద్యా శాఖ అధికారులపై మంత్రి లోకేష్ సీరియస్
Nara Lokesh : తమ పాఠశాలను విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి… తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో విద్యార్ధులు రోడ్డు ప్రమాదానికి గురవడంపట్ల మంత్రి నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. విద్యార్ధులను ధర్నాకు ఉపయోగించుకోవడం ద్వారా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు… చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ శ్యామ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వైసీపీ నాయకుల రాజకీయాలకు నలుగురు పిల్లలు గాయాలు పాలవగా… ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఆ ఫోటోలను ట్యాగ్ చేసారు. దీనితో అతని పోస్ట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)… ఇది చాలా దారుణమన్నారు. పిల్లల భవిష్యత్‌తో ఎవరూ ఆడుకోవద్దని.. ఇలా చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్ధులను రాజకీయ ఆందోళనకు తీసుకెళ్ళడం నేరం… దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి… నివేదిక సమర్పించాలని… అంతేకాకుండా గాయపడిన విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Nara Lokesh – శ్యామ్ ట్వీట్ ఇదే
‘గౌరవనీయులైన విద్యాశాఖా మంత్రి లోకేష్‌కు (Nara Lokesh).. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో జరిగిన ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిన్న స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే… జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్ గా ఎంఈవో, హెచ్‌ఎం ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.
ఎంఈవో, హెచ్‌ఎం బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతను ఫణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం. ఈ సంఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులైన ఎంఈవో, హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేం. త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ శ్యామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
శ్యామ్ పోస్ట్‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై సత్వరమే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం’ అంటూ మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు.
Also Read : CM Chandrababu: బనకచర్లపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
