Minister Raja Narasimha : యూపీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి
ఆరోగ్య కేంద్రాల్లో పవర్ సప్లై సిస్టమ్‌ను సైతం పరిశీలించాలని సూచించారు...
Raja Narasimha : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Raja Narasimha) ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై వెంటనే తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణపై ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు.
Minister Raja Narasimha Comments
ఈ సందర్భంగా ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ అగ్నిప్రమాదంపై రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆ ప్రమాదంలో 10మంది చిన్నారులు మృతిచెందడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాజనర్సింహ అధికారులను అప్రమత్తం చేశారు.ఇలాంటి ఘటనలు తెలంగాణలో చోటు చేసుకోకుండా చూడాలని, అందుకు ముందుగానే అన్ని ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు.తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్దపెద్ద ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి నివేదికలు తనకు అందించాలని మంత్రి రాజనర్సింహ(Raja Narasimha) తెలిపారు.
ప్రతీ ఆస్పత్రిలో ఫైర్ అలార్మ్, స్మోక్ట్ డిటెక్టర్స్ ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలని అధికారులకు మంత్రి చెప్పారు. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదాలు సంభవించి మంటలు ఏర్పడితే ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో, లేవో? చూడాలని.. వాటి తుది గడువు తేదీలను సైతం చెక్ చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే మంటలు ఆర్పే యంత్రాల వినియోగంపై ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీకి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో పవర్ సప్లై సిస్టమ్‌ను సైతం పరిశీలించాలని సూచించారు. ఆస్పత్రి భవనంలో పాత ఎలక్ట్రిక్ వైర్లు ఉంటే వాటి స్థానంలో నాణ్యమైన కొత్త కేబుల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి సుస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.
మరో వైపు ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించి చేయాల్సిన, చేయకూడని పనుల గురించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. సమీపంలోని అగ్నిమాపక శాఖ సిబ్బందితో ఆస్పత్రి అధికారులు సంబంధాలు కలగి ఉండాలని తెలిపారు. ఆస్పత్రి భవనాల్లో తరచుగా ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని అధికారులకు రాజనర్సింహ చెప్పారు. అగ్నిప్రమాదాలు సంభవిస్తే సురక్షితంగా బయటకు వచ్చేందుకు భవనం ప్లాన్‌కు సంబంధించిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Amit Shah : మహారాష్ట్ర మహాయుతి కూటమికి అభినందనలు తెలిపిన కేంద్ర హోంమంత్రి