Minister Satya Kumar Yadav : జూన్ 4 ఒక చారిత్రక దినమని ఉద్గాటించిన మంత్రి
మాజీ సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఏకగ్రీవంగా గళమెత్తిన రోజు ఇదని పేర్కొన్నారు...
Satya Kumar Yadav : గత జగన్ ప్రభుత్వ హయాంలోని ఐదేళ్ల అరాచకం, అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా తీర్పునిచ్చిన రోజు ఇదని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్(Satya Kumar Yadav) వ్యాఖ్యానించారు. ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ దినం, జగన్‌రెడ్డి అసలు స్వరూపం వెల్లడైన రోజు అని అభివర్ణించారు. జూన్4, 2024 ఓ చారిత్రాత్మక దినమని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించిన ప్రజల మనోభావం వెల్లడైన రోజు ఇదని వెల్లడించారు. ఇవాళ(బుధవారం) అమరావతిలో మీడియాతో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఏకగ్రీవంగా గళమెత్తిన రోజు ఇదని పేర్కొన్నారు.
Minister Satya Kumar Yadav Comments
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977లో దేశ ప్రజలు తిరగబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే రీతిలోనే.. ఏపీ ప్రజలు జగన్‌పై పోరాడారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. రాజ్యాంగ ప్రసాదితమైన ప్రజల ప్రాథమిక హక్కులైన స్వేచ్చా, స్వాతంత్య్రాలకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టిన పవిత్ర దినమని కొనియాడారు. అలాంటి పవిత్ర దినాన్ని వెన్నుపోటు రోజుగా ప్రకటించిన జగన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా అవమానించి తన మానసిక వికారాన్ని మరోసారి వెల్లడించుకోవడం దురదృష్టకరంమని అన్నారు. గతేడాది ఇదే రోజున ప్రజలిచ్చిన తీర్పునకనుగుణంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సంక్షేమాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
జగన్(YS Jagan) మాత్రం తన వినాశకర అంతఃస్వరూపాన్ని మార్చుకునేది లేదని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. విచక్షణ లేకుండా…తెనాలిలో రౌడీషీటర్లకు తన మద్దతును ప్రకటించి తన రూటు మారదని జగన్‌రెడ్డి మరోసారి తన వక్రబుద్దిని స్పష్టం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ వైఖరిని గమనించాలని… తగు జాగ్రత్తలో ఉండాలని…ఏపీలో మరోసారి అంధకారానికి ఏమాత్రం తావివ్వకూడదని హితవు పలికారు. గతేడాది ఇదే రోజున చారిత్రాత్మక తీర్పునిచ్చిన రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల ఆకాంక్షల సాకారానికి సారథ్యాన్ని వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లకు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Ethanol Factory: ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన
