Minister Satyakumar : నూతన విద్యావిధానంపై మరో అప్డేట్ ఇచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్
గత ఐదేళ్లల్లో మన విద్యా విధానం భ్రష్టు పట్టిందన్నారు...
Minister Satyakumar : అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నూతన విద్యా విధానంపై చర్చించడం ఆనందంగా ఉందన్నారు. నూతన విద్యా విధానంపై విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించారన్నారు. ‘‘ యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను. మీరంతా విద్యావేత్తలు.. మీకన్నా నాకు ఎక్కువ అంశాలు ఇందులో తెలియవు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Lokesh) రావాల్సి ఉన్నా. మరో అత్యవసర సమావేశం వల్ల ఆయన రాలేకపోయారు’’ అని తెలిపారు.
Minister Satyakumar Comment
గత ఐదేళ్లల్లో మన విద్యా విధానం భ్రష్టు పట్టిందన్నారు. భారతీయ విద్యా విధానం రూపుమాపి.. బ్రిటీష్ విద్యను అమలు చేశారన్నారు. ఇదే బానిస ఆలోచనలతో ఇంకా ఉంటే.. యువశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉండదన్నారు. వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విద్యా విధానం రావాలన్నారు. భారతీయ విలువను జోడించి, కొత్త విద్యా విధానం అమలు చేయాల్సి ఉందన్నారు. బ్రిటీష్ విద్యను అమలు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అన్యాయం చేశారన్నారు. 1986 లో కొత్త విద్యా విధానం రాజీవ్ గాంధీ నేతృత్వంలో వచ్చినా.. పూర్తిగా అమలు చేయలేదన్నారు. 2009 లో నాలెజ్డ్ కమీషన్ తీసుకు వచ్చి .. అందులో కొత్త విద్యా(Education) విధానం అమలు చేశారన్నారు.
ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరమని విద్యార్దులపై బలవంతంగా రుద్దారన్నారు. గతంలో ఏదైతే బానిస విద్య వద్దనుకున్నామో.. అదే అమలు చేశారని మండిపడ్డారు. ఇటీవల మళ్లీ కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యా విధానం వల్ల యువత భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని తెలిపారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదని.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి ప్రభుత్వంపై ఆధారపడకుండా.. ప్రైవేటు సంస్థలలో కూడా రాణించవచ్చన్నారు.
సమస్యలను, అవరోధాలను అధిగమించి ముందుకు సాగేలా విద్యా(Education) విధానం ఉండాలని పేర్కొన్నారు. బట్టి చదువుల వల్ల జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొంటారని అన్నారు. ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే.. మాతృభాషను మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు. చైనా, జపాన్‌లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో చూడాలన్నారు. ప్రాధమిక విద్య మొత్తం మాతృ భాషలో ఉంటేనే.. వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా.. మన దేశంలో మాత్రం పర భాషపై మోజు పెరిగిందన్నారు. ఎనిమిదో తరగతి నుంచి ఇతర దేశల భాషలు నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉందన్నారు.దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందువల్ల తాను ఇంజనీరింగ్ పూర్తి చేయలేక పోయానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ ద్వారా విద్యార్దులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
ఆర్ధిక పరిస్థితులు, ఇతర ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఈ నూతన విద్యా విధానం ద్వారా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ, ఇండస్ట్రీయల్, అగ్రికల్చరల్ రెవెల్యూషన్ వచ్చిన సమయంలో దేశం కూలీలను తయారు చేసిందన్నారు. గతంలో ఉన్న విద్యావవస్థల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేదన్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఉపాధి కోసమే కాదు.. విద్య కోసం వలసలు పోయారన్నారు. ఇప్పుడు ఉన్న విద్యా విధానం విద్యార్ధులకు ఒక వరం లాంటిందన్నారు. గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్ధిక విధానం తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. నేడు మన దేశం ఆర్ధిక వ్యవస్థగా ఎదిగి అగ్ర దేశాలకు ధీటుగా నిలుస్తుందన్నారు. నూతన విద్యా విధానం ద్వారా జరిగే మంచిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా వివరించాలని.. అయితే కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్న మాట వాస్తవమే అని అన్నారు.
Also Read : IAS Officers Transfer : తెలంగాణలో మళ్లీ మొదలైన ఐఏఎస్ ల బదిలీలు