Minister Seethakka : గత సర్కారు పని వల్లనే ఇప్పుడు పంచాయతీలకు ఇన్ని పాట్లు
ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను బుధవారం మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ఖండించారు...
Minister Seethakka : గత ప్రభుత్వ నిర్వాకంవల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు వారికి లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో కనీసం పాల్గొనకుండా రాజకీయాలు చేయడం హరీశ్‌రావుకు తగదన్నారు. ‘ పదే పదే అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మర్చిపోయారా?’ అని నిలదీశారు.
ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను బుధవారం మంత్రి సీతక్క(Minister Seethakka) ఓ ప్రకటనలో ఖండించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.10,170 కోట్లు కేటాయించి రూ.5,988కోట్లే విడుదల చేసిందన్నారు. పంచాయతీలకు 44శాతం నిధులివ్వకుండా గత ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. నేషనల్ రూర్బన్ (రూరల్ అర్బన్) మిషన్‌కు 2019 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి రూ.1,200 కోట్లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. స్వచ్ఛ భారత్‌మిషన్ కింద చేయించిన పనులకు సంబంధించి ఆరేళ్లుగా రూ.940 కోట్లు, రూరల్ ఇంజనీరింగ్ విభాగానికి రూ.600కోట్ల బిల్లులు చెల్లించలేదన్నారు.
Minister Seethakka Comment
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 నూతన పంచాయతీ చట్టం ద్వారా అడ్వర్‌టైజింగ్, మైనింగ్ వంటి పన్నులను పంచాయతీలకు రాకుండా చేసిందని, పంచాయతీలను ఆదుకోకపోగా ఆర్థికంగా మరింత దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంచాయతీలకు నిధులు కేటాయించలేదన్నారు. కేసీఆర్ జన్మదినం కోసం ఫిబ్రవరిలో మొక్కలు నాటించారని విమర్శించారు. కాగా మూడు రోజుల్లోనే 25 లక్షల మొక్కలు నాటించామని, 29 వేల కిలోమీటర్ల రహదారులు, 18 వేల కిలోమీటర్లకుపైగా డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచామని, ఇది బీఆర్‌ఎస్ నేతలకు కనబడటంలేదని సీతక్క పేర్కొన్నారు.
Also Read : Kemburi Rammohan Rao : బొబ్బిలి మాజీ ఎంపీ కెంబూరి రామమోహనరావు(75) కన్నుమూత