Minister Seethakka: చెంచు మహిళపై దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం!

చెంచు మహిళపై దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం!

Minister Seethakka: నాగర్‌ కర్నూల్‌ జిల్లా మొలచింతలపల్లి చెంచు మహిళపై అత్యంత పాశవికంగా దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఈశ్వరమ్మను బుధవారం మంత్రి పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడిన మంత్రి సీతక్క… ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైతే ఫోన్‌ చేయాలని సూచించారు.

Minister Seethakka Comment

నాగర్‌కర్నూల్‌ ఎస్పీ వైభవ్‌తో మాట్లాడి కేసు పురోగతి తెలుసుకుని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితురాలి మామ నాగయ్య మృతిపై అనుమానాలున్నందున ఆ కేసు పునర్విచారణ చేయాలని సూచించారు. ఘటన వెలుగులోకి రాగానే జిల్లా మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఐటీడీఏ, శిశుసంక్షేమ అధికారులు బాధితురాలికి అండగా నిలిచారని… దాడిఘటనకు భూవివాదమే కారణమని భావిస్తున్నామని సీతక్క తెలిపారు. బాధితురాలికి ఇప్పటికే  రూ.4లక్షలు మంజూరు చేశామన్నారు. మంత్రి వెంట శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ కాంతివెస్లీ, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సత్యనారాయణ, నాగర్‌కర్నూల్‌ ఐటీడీఏ పీవో రోహిత్‌  ఉన్నారు.

Also Read : Lok Sabha Deputy Speaker: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే ?

Leave A Reply

Your Email Id will not be published!