Minister Seethakka : ‘స్వచ్చందం-పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మండలాల వారిగా రివ్యూలు చేసి సమగ్ర నివేదికలు ఇవ్వాలని సూచించారు...
Minister Seethakka : స్వచ్ఛదనంపై మరింత శ్రద్ధ పెరగాలని మంత్రి సీతక్క(Minister Seethakka) సూచించారు. ‘ స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతంపై జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు బాగా కష్టపడ్డారని తెలిపారు. మంచి పనితీరు కనబరిచిన సిబ్బందిని ఆగస్టు 15వ తేదీన సన్మానిస్తామని చెప్పారు. గతంలో పోలిస్తే ఎక్కువ పని జరిగిందని.. కానీ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క తెలిపారు.
Minister Seethakka Comment
మండలాల వారిగా రివ్యూలు చేసి సమగ్ర నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. పారిశుధ్య లోపాలపై వార్తలు వస్తే సరిదిద్దాలని అన్నారు. తప్పుడు వార్తలు వస్తే అధికారులు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్పంచ్ ఎన్నికల వరకు అధికారులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని అన్నారు. జీపీ స్పెషల్ అధికారులు ఉదయం కనీసం మూడు గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి రోజు సిబ్బంది అంటెండెన్స్‌తో పాటు వారు చేసిన పనుల వివరాలను తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో జత యూనిఫాంలు సిద్ధం చేసి పంపిణీ చేయాలని అన్నారు. మహిళా సంఘాల సభ్యత్వాన్ని కోటి మందికి చేర్చాలని అన్నారు.
మహిళా శక్తి ప్రోగ్రాంలో ఎస్సీ, ఎస్టీ మహిళల భాగస్వామ్యం పెంచాలని సూచించారు. అధికారులు ఆవాస గ్రామాల్లో పర్యటించి మహిళా శక్తిలో చేర్పించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చికున్ గున్యా వంటి విష జ్వరాలతో ఊర్లకు ఊర్లు మంచాన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని జ్వర సర్వేలు చేసి జ్వర నివారణకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. అయినా తప్పుడు వార్తలు రాస్తూ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తే అధికారుల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. లేకపోతే ప్రభుత్వ పనితరం సరిగా లేదనే సంకేతాలు వెళ్తాయని మంత్రి సీతక్క(Minister Seethakka) పేర్కొన్నారు.
Also Read : Harish Rao : అధ్వానంగా ఉన్న ఐటీఐ కళాశాలల పరిస్థితి ప్రభుత్వానికి పట్టదు