Minister Veeranjaneya Swamy : వైసీపీ పెట్టుబడులను తరిమికొడితే..టీడీపీ పెట్టుబడులు తెస్తుంది

చేసిన తప్పుడు పనులకు వెన్నుపోటు పొడవక కొనసాగిస్తారనుకోవడం వైసీపీ భ్రమ అని మంత్రి అన్నారు...

Veeranjaneya Swamy : ఏపీలో అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టి సరైన తీర్పు వచ్చిన రోజు జూన్ 4 అని, వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా ప్రజలు తరిమికొట్టారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి(Veeranjaneya Swamy) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం మంత్రి ప్రకాశంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పులో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, ప్రజల తీర్పు జీర్ణించుకోలేక జూన్ 4 వెన్నుపోటు దినంగా చెబుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పుడు పనులకు వెన్నుపోటు పొడవక కొనసాగిస్తారనుకోవడం వైసీపీ భ్రమ అని మంత్రి అన్నారు.

Minister Veeranjaneya Swamy Slams YCP

ప్రజల మీద వైసీపీ(YCP) ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎవరినీ తాము వేధించడం లేదని, వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని మంత్రి అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు తరిమికొడితే… అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరిగి పెట్టుబడులు తీసుకువస్తున్నామన్నారు. జగన్ పక్కన ఉన్న 11 మంది కూడా మిగిలే పరిస్థితి లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి జోష్యం చెప్పారు.

కాగా గ్రామ, వార్డు సచివాలయాలను రేషనలైజేషన్‌లో మూడు కేటగిరీలుగా విభజన చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ విషయంపై చాలామంది సిబ్బందిలో అపోహలున్నాయని.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించమని ఆయన వారం రోజుల క్రితమే పేర్కొన్న విషయం తెలిసిందే. ఉద్యోగుల మధ్య పని విభజనపై కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చామన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి అయ్యాకే.. అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బదిలీల ప్రక్రియ మాదిరిగా వారి బదిలీలు ఉండవని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుర్తుచేశారు.

రేషనలైజేషన్‌ వల్ల పని భారం తగ్గుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. సచివాలయాల సంఖ్య పెరుగుతాయి… అంతే గాని తగ్గించమని స్పష్టం చేశారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరుగుతుందని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వందశాతం ఎస్సీలకే వినియోగించాలని సూచించారు. నోడల్ ఏజెన్సీ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించారు. ఎస్సీల విద్య, వైద్యం ఆరోగ్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి, ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడారు. నోడల్ ఏజెన్సీ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక రాజకీయ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

Also Read : Maoist Conspiracy : ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కుట్రను పసిగట్టి భగ్నం చేసిన భద్రతా బలగాలు

Leave A Reply

Your Email Id will not be published!