MLA Harish Rao : తెలంగాణ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి

ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి....

Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది పోలీసులను సర్వీస్ నుండి తొలగించడం పట్ల ఆయన మండిపడ్డారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే.. 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ‘ నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని, పోలీసుల కష్టాలు నాకు తెలుసు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని అన్నారు. అధికారం లేకుంటే ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా.. అంటూ నిలదీశారు. భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు(Harish Rao) అన్నారు.

Harish Rao Slams

కాగా సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. నిరసనల పేరుతో నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ 39 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఓ ఏఆర్‌ ఎస్సై, మరో హెడ్‌ కానిస్టేబుల్‌ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖలో నిబంధనలకు విరుద్ధంగా నిరసనలు తెలిపారన్న కారణంతో వీరిని తొలగిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ)లో సెలవులతోపాటు ఇతర అంశాలకు సంబంధించి అదనపు డీజీపీ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెటాలియన్ల సిబ్బంది, కుటుంబ సభ్యులు నిరసనలకు దిగారు. ఆర్డర్లీ వ్యవస్థ, సెలవులు ఇవ్వకపోవడం, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొందరు పరిధి దాటి వ్యవహరించినట్లు పోలీసు శాఖ అంతర్గత విచారణలో తేల్చారు. దీంతో ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌ జి. రవికుమార్‌; భద్రాద్రి కొత్తగూడంలోని ఆరో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌ కె. భూషణ్‌రావు; అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ వి.రామకృష్ణ, కానిస్టేబుల్‌ ఎస్‌.కె.షఫీ; సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్సై సాయిరామ్‌; కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్‌.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బి. అశోక్‌, ఆర్‌.శ్రీనివా్‌సలను విధుల నుంచి తప్పించారు. వీరందరిపై ఆర్టికల్‌ 311(2)(బి) ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. నిరసనల పేరుతో బెటాలియన్లలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిరసనలు తెలిపిన మరికొందరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. బెటాలియన్‌ సిబ్బంది తమ సమస్యలను దర్బార్లలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు.

Also Read : PM Modi : డిజిటల్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!