MLA Harish Rao: పార్టీ మార్పుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
MLA Harish Rao : పార్టీ మారుతున్నారంటూ తనపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారుతానని… జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని సూచించారు. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేటీఆర్(KTR) నాయకత్వంపై అనేక సార్లు నా అభిప్రాయాన్ని చెప్పానని, మాపార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకత్వ భాధ్యలు అప్పగిస్తే స్వాగతిస్తానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని క్లారిటీ ఇచ్చారు.
MLA Harish Rao Shocking Comments
ఈ నేపధ్యంలోనే రేవంత్ సర్కార్ పై హరీష్ రావు(MLA Harish Rao) తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మకోవటానికి రైతులు కల్లాల్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ధాన్యం రాశులను వదిలేసి… రేవంత్ అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు. అందాల పోటీల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉంటున్నారని… పాకిస్తాన్ ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ… రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదని సెటైర్లు వేశారు. రుణమాఫీ, రైతుబంధుపై సీఎం ఎందుకు రివ్యూ చేయటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని, చనిపోయిన రైతులకు 25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హామీలు అమలు చేయనందుకు తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, ఢిల్లీకి డబ్బులు పంపటంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని… 48గంటల్లో కాదు కదా… నెల రోజులకు కూడా రైతులకు డబ్బులు పడటం లేదని, ఐదు పైసలు కూడా బోనస్ కింద విడుదల చేయలేదని మండిపడ్డారు. పెట్టుబడి సాయం మెల్లగా.. ఏడాది పొడవునా ఇస్తామని భట్టి చెప్పటం సిగ్గుచేటి దూషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని నిప్పులు చెరిగారు. పది కిలోల తరుగు తీస్తున్నారని.. సీతక్క నియోజకవర్గంలో జట్టి రాజు ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలపై సీఎం రేవంత్ సమీక్ష చేయడని.. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండి.. వడదెబ్బతో రైతులు చనిపోతున్నారని ధ్వజమెత్తారు.
Also Read : CJI Sanjiv Khanna: అధికార పదవులకు దూరం – సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా