MLA KTR : ఈడీ విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న కేటీఆర్

కేటీఆర్ సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు...

KTR : తెలంగాణలో మళ్లీ సవాళ్లపర్వం మొదలైంది. లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. అయితే విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్(KTR).. సీఎంను సవాల్‌ చేయడమేంటని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. మాజీ మంత్రి కేటీఆర్‌ని నిన్న ఏడుగంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫార్ములా-ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై కూపీ లాగింది. కానీ.. ఈడీ, ఏసీబీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగాయని, అడిగిన సమాచారమంతా ఇచ్చేశానని చెప్పారు కేటీఆర్. ఇది రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్దమేనా అని సీఎం రేవంత్‌కి సవాల్ విసిరారు.

MLA KTR Slams…

ఫార్ములా ఈ కారు రేసింగ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏసీబీ అడిగిన ప్రశ్నలనే ఈడీ అధికారులు అడిగారన్నారు. ఏసీబీ, ఈడీ అడిగిన క్వశ్చనరీ సీఎం రేవంత్ రెడ్డిదేనని ఆరోపించారు కేటీఆర్. రేవంత్‌పై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అవే దర్యాప్తు సంస్థలతో తనపై కేసులు బనాయించారని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులపై తన మీద నమోదైన కేసులపై లై డిటెక్టర్ టెస్టు చేస్తే నిగ్గుతేలుతుందన్నారు. న్యాయమూర్తి ముందు లైడిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమన్నారు. సీఎం రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు కేటీఆర్.

కేటీఆర్ సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ ముఖ్యమంత్రిని సవాల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పరిధి దాటి మాట్లాడటం సరికాదన్నారు. ఈడీ, ఏసీబీ విచారణకు సంబంధించిన వివరాలను బయటపెట్టడం కరెక్ట్ కాదని అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా తామే అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఈడీ, ఏసీబీ కేసులను ఎదుర్కొంటున్న కేటీఆర్.. సీఎంకు సవాల్‌ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదిలావుంటే, ఈడీ విచారణ నేపథ్యంలో ఖాకీ శాఖ అప్రమత్తమైంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ముట్టడించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో గాంధీ భవన్‌ దగ్గర భారీ బందోబస్తు చేపట్టింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.

Also Read : Nitish Kumar Reddy : యువ క్రికెటర్ నితీష్ కు 25 లక్షల చెక్కును అందజేసిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!