TGSRTC Bus Accident : ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్సుల బస్సుకు యాక్సిడెంట్..19 మందికి గాయాలు
దీంతో బస్సులోని ఎన్నికల సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు...
TGSRTC Bus Accident : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఫిబ్రవరి 27) పట్టభద్ర, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఎన్నికల విధులు ముగించుకుని బ్యాలెట్ బాక్సులను అప్పగించేందుకు వెళ్తున్న 2 ఆర్టీసీ బస్సులకు అనుకోని రీతిలో ప్రమాదం జరిగింది. దీంతో బస్సులోని ఎన్నికల సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే.
TGSRTC Bus Accident at Jagtial
తెలంగాణలోని పలు జిల్లాల మాదిరిగానే గురువారం సాయంత్రం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిమాజామాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్‌లో అప్పగించేందుకు నిర్మల్ జిల్లా ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు. ఈ క్రమంలో జగిత్యాల(Jagtial) జిల్లా కొడిమ్యాల మండలం నమిళికొండ వద్దకు చేరుకోగానే నిర్మల్-బాన్సువాడకు చెందిన బస్సులు ఢీ కొన్నాయి.
ఈ ఘటనలో ఎన్నికల సిబ్బంది ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తున్న 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. బస్సు డ్రైవర్ మోయినోద్దీన్, పురుషోత్తం అనే అధికారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మినహా మిగతా అందరూ గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మార్చి 3న కరీంనగర్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు మూడు రోజులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు మరో 36 గంటల చొప్పున సమయం పట్టవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
Also Read : Minister Ponnam : నేటితో చివరి దశకు చేరనున్న కులగణన సర్వే