MLC Election Results: ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, శ్రీపాల్‌రెడ్డి ఎన్నిక
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, శ్రీపాల్‌రెడ్డి ఎన్నిక
MLC Election Results : తెలంగాణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Election Results) ఒక స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్, మరో చోట బీజేపీ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించగా… ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ(BJP) మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందారు. ఈ రెండో చోట్లా సిటింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
MLC Election Results Update
ఉమ్మడి కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్య పీఆర్టీయూ(టీఎస్) అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 15 మంది అభ్యర్థులు ఈ స్థానంలో పోటీపడగా తొలి ప్రాధాన్య ఓట్లతోనే కొమరయ్య విజయాన్ని అందుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన కూర రఘోత్తంరెడ్డి కేవలం 428 ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తంగా ఈ స్థానంలో 25,041 ఓట్లు పోలవగా 24,144 చెల్లుబాటయ్యాయి. 897 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పోలైన ఓట్లలో 50 శాతానికి మించి(12,074) ఓట్లు విజేతకు రావాల్సి ఉండగా కొమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గెలుపొందిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నిక హోరాహోరీగా సాగింది. పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. యూటీఎఫ్‌నకు చెందిన సిటింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గెలుపు కోసం 11,281(50శాతం) ఓట్లు సాధించాల్సి ఉండగా మొదటి ప్రాధాన్య ఓట్లలో అత్యధికంగా పింగిళి శ్రీపాల్‌రెడ్డికి(పీఆర్‌టీయూటీఎస్) 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపునకు అవసరమైన వాటికంటే 5,246 తక్కువగా వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి దిగువ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు లభించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు.
కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్
మరోవైపు ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 10 గంటల తర్వాతే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకా చెల్లిన, చెల్లని ఓట్లను వేరుచేస్తున్నారు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనుండడంతో కౌంటింగ్ ఆలస్యం కానుంది. ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో భారీగా ఓట్లు చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా.. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో, నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావిలో కౌంటింగ్ జరిగింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయగా, కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మాత్రమే పోటీ చేసింది.
Also Read : Telangana Government: గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపాటకు తెలంగాణ సర్కార్ నిర్ణయం