MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ ! కవితను అరెస్ట్ చేసిన సీబీఐ !
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ ! కవితను అరెస్ట్ చేసిన సీబీఐ !
MLC Kavitha: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ చేతిలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను… గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ… కవితను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించింది. కోర్టుకు కూడా తెలిపింది. దీనితో ఈడీ కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయ్యింది. కాగా లిక్కర్ స్కాంకు సంబంధించి ఇటీవల తీహార్ లో జైలులోనే కవితను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపిస్తుంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్ పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్ లపై దర్యాప్తు చేస్తోంది.
MLC Kavitha Case Updates
సౌత్ గ్రూపుకు ఆప్ కు మధ్య కవిత(MLC Kavitha) దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే కవితను అరెస్ట్ చేసినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ తరలించారు. రేపు (శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు.
ఇక లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఈడీ కస్టడీలో ఉన్నారు.
Also Read : Rajiv Ratan: అశ్రునయనాలతో రాజీవ్ రతన్ కు తుదివీడ్కోలు ! పాడె మోసిన సీనియర్ ఐపీఎస్ లు !