MLC Kavitha: వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత !
వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత !
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. కవిత(MLC Kavitha) అరెస్టు అక్రమమని ఆమె తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు… శనివారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.
MLC Kavitha – కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్- సీఎం రేవంత్
మరోవైపు కవిత అరెస్టును ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దొంగదెబ్బ తీయడానికే రాజకీయ డ్రామా చేశారని, కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని, ఈడీ ఒకేరోజు హైదరాబాద్ వచ్చారని, ఈ కేసులో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అడిగారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ సానుభూతి, అవినీతిని సహించేది లేదంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారన్నారు.
Also Read : CM Revanth Reddy: హక్కుల కోసం తెలుగువారంతా ఏకమవుదాం: సీఎం రేవంత్