MS Dhoni Comment : లోక నాయ‌కుడికి జేజేలు

అసాధార‌ణం అద్భుత విజ‌యం

MS Dhoni Comment : ఓట‌మి ఇచ్చే కిక్కు స‌క్సెస్ ఇవ్వ‌ద‌ని బాగా న‌మ్మే వ్య‌క్తుల‌లో ఒక‌రు జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). యావ‌త్ ప్ర‌పంచం క‌ళ్ల‌ప్ప‌గించి ఎదురు చూసిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ లో త‌న జ‌ట్టుకు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. ఇది మామూలు విష‌యం కాదు. సీజ‌న్ ఆరంభాని కంటే ముందు గాయాలు వెంటాడాయి. ఆట‌గాళ్లు స‌రైన లైన్ లోకి రాలేదు. సీనియ‌ర్ల‌ను ఏరి కోరి తీసుకున్నాడు. ఇదే స‌మ‌యంలో ఆరంభ మ్యాచ్ లోనే ప‌రాజ‌యం. ఇంకొక‌రైతే నిరాశ‌కు గుర‌వుతారు. ఒక్కోసారి త‌ల్లడిల్లి పోతారు. మీడియా సంధించే ప్ర‌శ్న‌ల‌కు, ఫ్యాన్స్ చేసే కామెంట్స్ ,ట్వీట్ల‌కు పిచ్చెక్కిపోతుంది. కానీ అక్క‌డ ఉన్న‌ది ఎవ‌రో కాదు మిస్ట‌ర్ కూల్. మిన్ను విరిగి మీద ప‌డినా , స‌ముద్రం ఉప్పొంగినా, భూ కంపం సంభ‌వించినా , ఓర్చు కోలేని రీతిలో క‌ష్టాలు వెంటాడినా చెక్కు చెద‌ర‌ని మ‌న‌స్త‌త్వం..ధీర‌త్వం అత‌డిని రాటు దేలేలా చేశాయి. నాయ‌కుడిని చేశాయి.

అంద‌రూ ఆట‌ను ఆట‌గానే చూస్తారు. కానీ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) దానిని ఓ యుద్దంలా చూస్తాడు. బ‌య‌ట ఎంత ప్ర‌శాంతంగా ఉంటాడో మైదానంలోకి వ‌స్తే పూర్తిగా మారి పోతాడు. అత‌డి అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు. ఎప్పుడు ఎవ‌రిని ఎలా వాడు కోవాలో, ప్ర‌త్య‌ర్థుల‌ను ఎలా దెబ్బ కొట్టాలో, విస్మ‌య ప‌రిచేలా చేయాలో ధోనీకి తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌దు. ఇది అక్ష‌రాల స‌త్యం. అంతెందుకు నిత్యం బీసీసీఐపై, భార‌త ఆట‌గాళ్ల‌పై నోరు పారేసుకునే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, మాజీ , తాజా పాక్ క్రికెట‌ర్లు సైతం ఎంఎస్ ధోనీని(MS Dhoni) ప్ర‌శంసించ‌కుండా ఉండ లేక పోతున్నారు. అత‌డిలో ఉన్న స్పెషాలిటీ అదే. ఎక్క‌డా త‌గ్గ‌డు. ఎప్పుడూ ఓట‌మిని ఒప్పుకోడు. గెలుపు అంచుల దాకా వెళ్లినా ఒక్క అడుగు వెన‌క‌డుగు వేయ‌డు. అందుకే ధోనీకి అంత‌మంది అభిమానులు. లెక్కించ లేనంత‌టి ఫ్యాన్స్. ల‌క్ష‌ల్లో కాదు కోట్ల‌ల్లో ఉంటారు. ఎక్క‌డికి వెళ్లినా ధోనీ జ‌పం వినిపిస్తుంది.

అది మంత్ర దండ‌మై మ‌న‌ల్ని క‌ట్టి ప‌డేస్తుంది. ధోనీ స్వ‌స్థ‌లం జార్ఖండ్ . కానీ త‌మిళ‌నాడు ఈ దిగ్గ‌జ ఆట‌గాడిని త‌మ‌లో కలిపేసుకుంది. త‌మిళులే అంత వాళ్ల‌కు కోపం వ‌చ్చినా సంతోషం క‌లిగినా త‌ట్టుకోలేరు. వెంట‌నే బ‌య‌ట‌కు ప్ర‌క‌టిస్తారు. వాళ్ల ర‌క్తంలోనే ఉంది. ఇప్పుడంతా ధోనీని త‌లైవా అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. అంత‌లా వాళ్ల‌లో క‌లిసి పోయాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ పోరుకు స్టేడియం నిండి పోయింది. నినాదాల‌తో హోరెత్తి పోయింది. త‌మ క్రికెట్ దేవుడు నువ్వేనంటూ దిక్కులు పిక్క‌టిల్లేలా నామ స్మ‌ర‌ణ చేశారు. చరిత్ర సృష్టించే వాళ్లు..విజ‌యాన్ని కాంక్షించే వాళ్లు వేటినీ ప‌ట్టించుకోర‌ని ధోనీని చూస్తే అర్థం అవుతుంది. విజేత‌లు ఎక్క‌డి నుండో రారు..మ‌నలోంచి పుట్టుకు వ‌స్తారు. వాళ్లే నాయ‌కులుగా..అధినాయ‌కులుగా..అసాధార‌ణ విజేత‌లుగా..లోక నాయ‌కులుగా త‌యార‌వుతారు. ధోనీ ఇవాళ ఉండ‌వ‌చ్చు..రేపు లేక పోవ‌చ్చు..కానీ ఒక్క‌టి మాత్రం నిజం..స‌క్సెస్ కావాలంటే ఎవ‌రినీ దేబ‌రించాల్సిన ప‌నిలేదు..ధోనీని అర్థం చేసుకుంటే చాలు..అదే మ‌న‌ద‌వుతుంది. గెలిచేలా చేస్తుంది..

Also Read : Rajasthan Congress

Leave A Reply

Your Email Id will not be published!