Munugodu Result Comment : నిశ్శబ్ద విప్లవం దేనికి సంకేతం
మునుగోడుపై ఎగ్జిట్ పోల్స్ నిజమేనా
Munugodu Result Comment : మునుగోడు ఉప ఎన్నిక కథ ముగిసింది. పోలింగ్ పూర్తయింది. సవాలక్ష అవలక్షణాలు బయట పడ్డాయి పోలింగ్ సందర్బంగా. భారీ ఎత్తున ప్రలోభాలు కొనసాగాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఇక బాధ్యత కలిగిన ప్రభుత్వం పూర్తిగా పాలనను పక్కన పెట్టేసి మునుగోడు మీద ఫోకస్ పెట్టింది.
ఇక రాష్ట్ర అధిపతి ఢిల్లీలో మకాం వేస్తే మొత్తం యంత్రాంగం, కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు , ఇతర ప్రజా ప్రతినిధులంతా కొలువు
తీరారు. మునుగోడులో అడుగడుగునా అధికార దర్పాన్ని ప్రదర్శించారు. 3 వేల మంది పోలీసులు 20 కేంద్ర బలగాలు , 119 కేంద్రాలు 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
లెక్కకు మించి నోట్ల కట్టలు వరదలా పారుతుంటే చూసీ చూడనట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 98 ఫిర్యాదులు అందాయని
సెలవిచ్చారు సిఇఓ. ఇది పక్కన పెడితే విస్తు పోయే సమాచారం ఇచ్చారు. రూ. 8. 25 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని దీనికి లెక్కా పత్రం లేదన్నారు. ఈ డబ్బులు ఎవరివి. ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రకటించ లేదు.
ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కానీ ఆ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుండి గుడ్ బై చెప్పారు. అటు నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం కొనసాగింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు శక్తి వంచన లేకుండా శ్రమించాయి.
కానీ వందలాది వాహనాలు, లెక్కించ లేనంత డబ్బులు, తల వంచుకునేలా మద్యం, ఇతర బహుమతులు మునుగోడు ప్రజలను ఆశ్చర్య పోయేలా
చేశాయి. ఇవేవీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనిపించక పోవడం విశేషం. ఇది పక్కన పెడితే గతంలో ఎన్నడూ లేనంతగా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లో 93 శాతానికి పైగా నమోదైంది.
ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్తగా అధికారంలో ఉన్న గులాబీ గెలుస్తుందని ఇప్పటికే ప్రకటించాయి(Munugodu Result) . నియోజకవర్గంలో 2 లక్షల 41 వేల 805 ఓటర్లు ఉంటే 2 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఓ రికార్డు. ఇక దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి.
టీఆర్ఎస్ డూ ఆర్ డై గా తీసుకుంది. వచ్చే ఎన్నికలకు రిహార్స్ ల్ గా భావించింది. అన్ని శక్తులను ప్రయోగించింది. ఇక బీజేపీ
చాప కింద నీరులా ప్రచారం చేపట్టింది. ఇక్కడ పార్టీ కంటే కోమటిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న చరిష్మా ఎక్కువ ప్రభావితం చేసిందని చెప్పక తప్పదు.
మొత్తం ఓటర్లలో బీసీలు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు, ఇతర కులాల వారి ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక యూత్ కీలకం కానున్నారు. ఎప్పుడైనా పోలింగ్
పరంగా చూస్తే అత్యధిక ఓటు శాతం నమోదైందంటే అధి అధికార ప్రభుత్వానికి ప్లస్ పాయింటా లేక మైనస్ అవుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
మొత్తంగా బీజేపీ మౌనంగా ఉంటే టీఆర్ఎస్ సంతోషంలో మునిగి తేలుతోంది. ఇక కాంగ్రెస్ డిపాజిట్ వస్తే చాలని అనుకుంటోంది. నిశ్శబ్ద విప్లవం ఎవరి వైపు విజయాన్ని చేకూర్చు పెడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read : ‘గులాబీ’కి జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్