Munugodu Money Comment : మునుగోడు సంబురం ముగిసింది. ఉప ఎన్నికకు తెర పడింది. ఆరోపణలు, విమర్శలు, కేసులు, దాడులు, కోట్లు, మద్యం, మాంసం..ఇలా చెప్పుకుంటూ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి అవలక్షణం హైలెట్ గా నిలిచింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి.
రాజకీయాలను భ్రష్టు పట్టించి పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసిన నేతలను దోషులుగా ప్రకటించనంత కాలం ఇలాగే ఎన్నికలు సాగుతాయి.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ ముందు జాగ్రత్తగానే హెచ్చరించారు.
ఆయన ఆనాడు ఊహించిననట్లుగానే ఇవాళ కళ్ల ముందు కనిపిస్తోంది. దేశంలోని ఆరు రాష్ట్రాలలో 7 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. కానీ తెలంగాణలోని
మునుగోడు ఒక్కటే చర్చనీయాంశంగా మారింది.
అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మారిన ఈ నియోజకవర్గంలో గెలిచింది అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కావచ్చు. కానీ ఓడింది మాత్రం ముమ్మాటికీ ప్రజలే.
నిత్య చైతన్యానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా పోరాటాల గడ్డగా పేరొందిన తెలంగాణలో ఇలాంటి అప్రజాస్వామిక ధోరణలు కొనసాగుతాయని ఏనాడూ అనుకోలేదు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పవర్ లో ఉన్న గులాబీ, 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో పాటు మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కోట్లాది రూపాయలు కుమ్మరించారు. మద్యాన్ని ఏరులై పారించారు. హామీల వర్షం కురిపించారు. రెండు నెలల నుంచి మునుగోడు హాట్ టాపిక్ గా మారింది. ప్రలోభాలకు హద్దు లేకుండా పోయింది. తాయిలాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
పూర్తిగా రాష్ట్రంలో పాలన స్తంభించి పోగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఇలా ప్రతి ఒక్కరు మోహరించారు. మునుగోడును జల్లెడ పట్టారు. కాషాయం, గులాబీ పార్టీలు పోటా పోటీగా ఖర్చు పెట్టాయి.
ఎక్కడ చూసినా తాగి పడేసిన మద్యం సీసాలు దర్శనం ఇచ్చాయి. బీజేపీ , టీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించారు. వందల కోట్లు ఖర్చు చేశారంటూ విమర్శలు(Munugodu Money) గుప్పించారు.
విచిత్రం ఏమిటంటే పార్టీలను, అభ్యర్థులను, నేతలను నియంత్రించాల్సిన కేంద్ర , రాష్ట్ర ఎన్నికల సంఘాలు చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అంతకంటే బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది. ఈ సమయంలో టీఎన్ శేషన్, లింగ్డో లాంటి వాళ్లు ఎందుకు లేరన్న ప్రశ్న ఉదయించింది. ఏకంగా రూ. 8
కోట్లకు పైగా లెక్క చూపని కోట్లు తాము పట్టుకున్నామని సిఇఓ వికాస్ రాజ్ వెల్లడించడం విశేషం.
కేసుల నమోదు పక్కన పెడితే ఓడిన వారు గెలిచిన వారిపై..విజయం సాధించిన వారు ఓడిన వారిపై విమర్శలు చేసుకోవడం పరిపాటే. కానీ రాను రాను
ఎన్నికలను ప్రజలకు దూరం చేయడంలో భాగంగానే కార్పొరేట్ శక్తులు డబ్బులు కురిపిస్తూ ప్రభుత్వాలను శాసించడం మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టాయి.
ఈ మొత్తం అధికార మదానికి, అహంకారానికి, ఆత్మ గౌరవానికి జరిగిన ఎన్నికలు కానే కావు. మొత్తంగా ప్రజలను ప్రశ్నించకుండా చేయడంలో భాగంగా జరుగుతున్న వికృత క్రీడగా దీనిని పేర్కొనడంలో తప్పు లేదు. మొత్తంగా మునుగోడులో మునిగింది పార్టీలు, పాలకులు, నేతలు కాదు..ముమ్మాటికీ ప్రజలే.
Also Read : యాత్ర సరే ఓటమి మాటేంటి