Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్ !

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్ !

Nandigam Suresh: వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ లో ఆయన్ను అరెస్ట్‌ చేసి గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీనితో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సురేశ్‌ను అరెస్టు చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు.

Nandigam Suresh…

సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. సురేశ్(Nandigam Suresh) హైదరాబాద్‌ లో ఉన్నారని నిర్ధారించుకున్న అనంతరం మంగళగిరి పోలీసులు అక్కడికి వెళ్లారు. పక్కా సమాచారంతో అక్కడ ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్‌ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటుచేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్(Nandigam Suresh), తలశిల రఘురామ్‌ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించారు. టీడీపీ అధికారంలోకి రాగానే… వీరంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అరెస్ట్ నుంచి రక్షించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Telangana: తెలంగాణాలో సుడిగాలి మిస్టరీ ! 500 ఎకరాల విస్తీర్ణంలో నేలకూలిన చెట్లు !

Leave A Reply

Your Email Id will not be published!