Narendra Modi: జూన్ 4 తరువాత భారత విరోధులు పారిపోక తప్పదు – ప్రధాని మోదీ
జూన్ 4 తరువాత భారత విరోధులు పారిపోక తప్పదు - ప్రధాని మోదీ
Narendra Modi: తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్పష్టంచేసారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని… బీజేపీను గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది కాషాయ పార్టీని గెలిపించాలని సంకల్పం తీసుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జూన్ 4 తర్వాత భారత విరోధులు పారిపోక తప్పదని హెచ్చరించారు.
Narendra Modi Slams
‘‘జూన్ 4 తర్వాత ఉమ్మడి పౌరస్మృతి వద్దన్నవారు… ఆర్టికల్ 370 రద్దు వ్యతిరేకులు పారిపోక తప్పదు. మధ్య తరగతి ప్రజల కలలను బీజేపీ సర్కారు నెరవేరుస్తోంది. పదేళ్లలో ఎన్నో సమస్యలకు ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారం చూపింది. డిజిటల్ రంగంలో, స్టార్టప్ సంస్థల్లో నేడు భారత్ సూపర్ పవర్. దేశాన్ని లూటీ చేయడం, వారసత్వ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ది ట్రాక్ రికార్డు. కాంగ్రెస్ పాలనలో నగరంలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. వారి పాలనలో ఎక్కడికెళ్లాలన్నా భయపడాల్సి వచ్చేది. భారతీయుల పట్ల కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారు. దేశాన్ని విభజించి పాలించాలనేది ఆ పార్టీ కుట్ర. శ్రీరామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు మాట్లాడుతున్నారు. శ్రీరాముడిని పూజించడం దేశ ద్రోహమా? ‘అహింసో పరమోధర్మో అనేది ఇండియా సిద్ధాంతం. వసుధైక కుటుంబం, బుద్ధం శరణం గచ్చామి.. ప్రజాసేవే భగవాన్ సేవ. నరుడే..నారాయణుడు అన్నదే భారత్ సిద్ధాంతం. వేల సంవత్సరాల సంస్కృతి రక్షణ భారత్ అసలైన సిద్ధాంతం.
గత ప్రభుత్వం హైదరాబాద్ ముక్తి దివస్‌ను నిర్వహించలేదు. బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించింది. మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదనేది బీజేపీ సిద్ధాంతం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఆర్‌ఆర్ ట్యాక్స్ మొదలైంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఏటీఎంగా మార్చుకున్నారు. తాజాగా ఇక్కడ ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్ కూడా మొదలైంది. మూడో ఆర్ అంటే… రజాకార్ ట్యాక్స్. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్రానికి 4 వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరు? తొలి ఎయిమ్స్ ఇచ్చిందెవరు? ఫెర్టిలైజర్స్ పరిశ్రమ ఇచ్చిందెవరు? పసుపు బోర్డు ఇచ్చిందెవరు? గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిందెవరు?’’ అని మోదీ ప్రశ్నించారు.
Also Read : Air India Express: 75 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు !