Nathan Lyon : అబ్బా నాథన్ లయాన్ దెబ్బ
మరోసారి దెబ్బ కొట్టాడు
Nathan Lyon : ముచ్చటగా మూడో టెస్టులో కూడా సత్తా చాటాలని ప్రయత్నం చేసిన భారత జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది ఆసిస్ బౌలర్ నాథన్ లయాన్ రూపంలో. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను రేపుతోంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలు తప్పాయి. ముందుగా బ్యాటింగ్ తీసుకున్న భారత్ 109 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆసిస్ 197 పరుగులకు ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియా మరోసారి ఇబ్బంది పడింది. కడపటి వార్తలు అందేసరికి 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ తొమ్మిది వికెట్లలో ఆసిస్ బౌలర్ నాథన్ లయన్(Nathan Lyon) ఏకంగా 7 వికెట్లు తీశాడు. లయాన్ మరోసారి దెబ్బ కొట్టాడు. భారత జట్టుపై వరుసగా ఐదు వికెట్లకు పైగా తీసుకోవడం ఇది తొమ్మిదో సారి కావడం విశేషం. 140 వద్ద ఏడో వికెట్ కోల్పోగా 155 వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది.
ఇక ఛతేశ్వర్ పుజారా మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ 12, గిల్ 5 , పుజారా 59 రన్స్ చేశారు. విరాట్ కోహ్లీ 13, జడేజా 7, శ్రేయాస్ అయ్యర్ 28, శ్రీకర్ భరత్ 3, రవిచంద్రన్ అశ్విన్ 16, అక్షర్ పటేల్ 8 పరుగులు చేశారు.
నాథన్ లయాన్ కొట్టిన దెబ్బకు ఠారెత్తి పోయారు భారత బ్యాటర్లు. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా ఈ టెస్టులో భారత్ ను మట్టి కరిపించేలా ఉంది. భారీ స్కోర్ చేయాలని భావించిన టీమిండియాకు లయాన్ అడ్డంకిగా మారాడు. మొత్తంగా మరోసారి భారత్ నడ్డి విరిచాడు నాథన్ లయాన్(Nathan Lyon).
Also Read : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ రిలీజ్