National Investigation Agency: బెంగుళూరు బాంబు పేలుడు నిందితుడిపై రూ. 10లక్షల రివార్డు !
బెంగుళూరు బాంబు పేలుడు నిందితుడిపై రూ. 10లక్షల రివార్డు !
National Investigation Agency: బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. బాంబు పేలుడులో కీలక పాత్ర పోషించిన నిందితుడ్ని పట్టుకునేందుకు విచారణను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా రామేశ్వరం కెఫేతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను సేకరించి… నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు ? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు ? అనే అంశంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. బాంబు పేలుడులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించడంతో… ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బుధవారం కీలక ప్రకటన చేసింది.
National Investigation Agency Announce
రామేశ్వరం కెఫే పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ(National Investigation Agency) బుధవారం కీలక ప్రకటన చేసింది. కెఫేతో పాటు చుట్టు ప్రక్కల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి ఫోటోను ఎన్ఐఏ అధికారులు విడుదల చేసారు. అంతేకాదు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. ఈ మేరకు ఎన్ఐఏ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిందితుడి వివరాలతో పాటు… ఆచూకీ తెలపాల్సిన అడ్రస్, ఫోన్ నెంబర్, ఇతర వివరాలను పోస్ట్ చేసింది. అంతేకాదు సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది.
కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఈ మేరకు నిందితుడి సీసీకెమెరా ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో ఐదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల ఫుటేజ్ లను పోలీసులు విశ్లేషించారు. తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. అతడిని ప్రధాని అనుమానితుడిగా గుర్తించిన ఎన్ఐఏ అధికారులు… అతని ఆచూకి తెలిపిన వారికి నగదు రివార్డు ఇస్తామని తాజాగా ప్రకటించారు.
Also Read : TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణా ప్రభుత్వం గుడ్న్యూస్ ?