New CEC : కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ‘జ్ఞానేష్ కుమార్’

సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ ఈ పదవిలో 2029 జనవరి 26 దాకా కొనసాగుతారు...

New CEC : భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ (61) నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా వివేక్‌ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఈ నోటిఫికేషన్లలో వెల్లడించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితాలో జ్ఞానేశ్‌ కుమార్‌(Gyanesh Kumar)ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేశారు.

New CEC Gyanesh Kumar

దీంతో సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసిన నూతన సీఈసీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం సోమవారం రాత్రి భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న జ్ఞానేశ్‌ కుమార్‌ సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ ఈ పదవిలో 2029 జనవరి 26 దాకా కొనసాగుతారు. అలాగే ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్‌ స్థానంలో హరియాణా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన డాక్టర్‌ వివేక్‌ జోషిని నియమించారు.

కాగా ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇవి తొలి ఎంపికలు కావడం విశేషం. ప్రస్తుత సీఈసీగా కొనసాగుతున్న రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం (ఫిబ్రవరి 18) మంగళవారంతో ముగియనుంది. ఆయన తర్వాత సాధారణంగా ఎన్నికల కమిషనర్‌లలో సీనియర్‌ను సీఈసీగా నియమిస్తుంటారు. ఈసారి కూడా దానినే కొనసాగిస్తూ అత్యంత సీనియర్‌ అయిన జ్ఞానేశ్‌ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ కుమార్‌ కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఈయన 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా నియమితులయ్యారు. కొత్త సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పర్యవేక్షణలోనే బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జ్ఞానేశ్‌ కుమార్ కేంద్ర హోంశాఖలో పని చేస్తున్న సమయంలో ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

Also Read : Minister Sridhar Babu : మూడేళ్ళలో 30 వేలమందికి కొలువులు పక్కా

Leave A Reply

Your Email Id will not be published!