కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్ లో కృనాల్ పాండ్యా సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ పైచేయి సాధించింది. ఒకానొక దశలో హైదరాబాద్ గెలుపు అంచుల దాకా వచ్చింది. కానీ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు ప్రేరక్ మన్కడ్, నికోలస్ పూరన్. ప్రధానంగా పూరన్ పూనకం వచ్చినట్టు ఆడాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన అనుభవాన్ని రంగరించి హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొని అజేయంగా 44 రన్స్ చేశాడు.
ఇక ప్రేరక్ మన్కడ్ సైతం తానేమీ తక్కువ కాదంటూ దంచి కొట్టాడు. కేవలం 45 బంతులు ఎదుర్కొని అజేయంగా 64 పరుగులు చేశాడు. వీరికి తోడు మార్కస్ స్టోయినిస్ 25 బంతులు ఎదుర్కొని 40 రన్స్ తో కీలక పాత్ర పోషించాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఇదిలా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ రేసులోకి దూసుకు వెళ్లింది. 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది.