#NTR : నట పరిపాలనా సార్వ భౌముడు నందమూరి తారక రాముడు
NTR : తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో, ప్రేమతో, ముద్దుగా పిలుచుకునే నందమూరి తారక రామారావు, అటు సినీరంగంలో అటు రాజకీయ రంగంలో మకుట రహిత మహారాజుగా ఖ్యాతిని ఆర్జించారు.
NTR : తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో, ప్రేమతో, ముద్దుగా పిలుచుకునే నందమూరి తారక రామారావు, అటు సినీరంగంలో అటు రాజకీయ రంగంలో మకుట రహిత మహారాజుగా ఖ్యాతిని ఆర్జించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. నటనకే పరిమితం కాక, పలు చిత్రాలను నిర్మించి, మరి ఎన్నింటికో దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. సినీ కళామతల్లి సేవలతో పాటు, ప్రజా సేవ కూడా చేయాలని నిర్ణయించుకొని, రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది మాసాల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించి, హస్తానికి అధికారాన్ని గతం చేసి, తెలుగుదేశం పక్షాన హస్తగతం చేసుకున్నారు. మూడు విడతలుగా ఏడు సంవత్సరాల పాటు అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరుగా తెలుగు భాషకు, తెలుగు జాతికి, దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అభిలాంధ్ర అందాల నటుడు నందమూరి తారక రాముడు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో, పదమూడేళ్ల రాజకీయ జీవితంలో చిరస్మరణీయునిగా వెలుగొందారు ఆయన. ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు”గా భ్యాతిగాంచారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సుయోధనుడు రావణుని వంటి పౌరాణిక పాత్రల తో బాటు వైవిధ్య భరిత సాంఘిక, జానపద చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించారు. సాటిలేని మేటిగా “చిత్రసీమ రారాజుగా భాసిల్లిన స్థితప్రజ్ఞులు రామారావు, 44 ఏళ్ల సినీ ప్రస్థానంలో, 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలతో పాటు పలు తెలుగు, తమిళ చలన చిత్రాలలో విభిన్న పాత్రలకు జీవం పోశారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం తొమ్మిది మాసాల కాల వ్యవధి లోనే, అప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగిన కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడించి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా పగ్గాలు చేత బుచ్చుకుని, ఎనిమిదేళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రజల హృదయాలలో స్థిర స్థానం పొందారు. 1923 మే న కృష్ణాజిల్లా పామూరు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించి, తారక రాముని”గా నామాంకితులై, విజయవాడ మున్సిపల్ స్కూల్లో, తర్వాత ఎస్.ఆర్. ఆర్ కళాశాలలో చదివారు. “కవి సామ్రాట్” విశ్వనాథ సత్య నారాయణ తెలుగు భాష ఉపాధ్యాయునిగా రామారావుకు “ఆడ వేషం” వేసే అవకాశం కల్పిస్తే, మీసాలు తీయకనే నటించి, “మీసాల నాగమ్మ” పిలువ బడ్డారు. విద్యాభ్యాస సమయంలో ఆస్తి హరించుకు పోగా, కొద్ది రోజులు పాల వ్యాపారం, కిరాణా షాపు, ఒక ముద్రణాలయాన్ని నడిపారు. 1942 లో మేనరికంగా బసవ తారకంను వివాహ మాడారు.
నాటి ప్రఖ్యాత నటులు “కొంగర జగ్గయ్య, రక్త కన్నీరు నాగభూషణం, కె.వి.ఎస్. ముక్కామల” లాంటి నటులతో “నేషనల్ ఆర్ట్ థియేటర్” నాటక సంస్థను స్థాపించారు. తర్వాత కాలంలో సదరు సంస్థ కొన్ని చిత్రాలు కూడా తీసింది. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ మోహన కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, కుమారులు కాగా, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమా మహేశ్వరి కూతుళ్ళు కలిగారు. 1947 లో పట్టభద్రులై మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి 1100 మందికి, ఏడుగురిలో ఎంపికై సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం పొంది, తన కార్యక్షేత్రం సినీ రంగంగా ఎంచి, ఉద్యోగాన్ని వదిలారు. ప్రముఖ సినీ నిర్మాత బి.ఎ.సుబ్బారావు రామారావును మద్రాసు పిలిపించి, “పల్లెటూరి పిల్ల” చిత్రంలో కథానాయకుడి పాత్రను 116 రూపాయల పారితోషకం అందించారు.
అయితే 1949 లో విడుదలైన “మన దేశం” ఎన్టీఆర్ కెమెరా ముందు నిలిచిన తొలి చిత్రం అయింది. తర్వాత దర్శకుడు యోగానంద్ కలిసి మద్రాసులో చిన్న గదికి మకాం మార్చారు. 1951లో నటించిన, నాటికీ నేటికీ తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిన పాతాళభైరవి” చిత్రం. 10 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. 1956 లో *మాయాబజార్’ చిత్రానికి ఎన్టీఆర్ తీసుకున్న 7500 రూపాయల పారితోషికం నాడు అత్యధికం. తర్వాత భూకైలాస్” “వెంకటేశ్వర మహత్యం” భారీ విజయాలు సాధించగా, “శ్రీమద్విరాటపర్వం”లో ఐదు పాత్రలు పోషించి ఔరా అనిపించు కున్నారు.1952 నుండి ఎన్టీఆర్ పారితోషికం లక్షల్లోకి చేరింది. “లవకుశ”, “సీతారామ కళ్యాణం”, “దాన వీర శూర కర్ణ”, “నర్తనశాల”, “విశ్వామిత్ర” లాంటి చిత్ర రాజాలు, ఆయన నటనకు కలికి తురాయిలుగా నిలిచాయి. “న భూతో న భవిష్యతి” అనిపించాయి. “అడవి రాముడు” “యమగోల” బాక్సాఫీసు విజయాలు సాధించాయి. చిత్ర సీమలో రారాజుగా ఉన్న ఎన్టీఆర్(NTR) “ప్రజా సేవ” వైపు తమ దృష్టిని మరల్చారు. 1978లో రాష్ట్ర కాంగ్రెస్ లో కుమ్ము లాటలు, ఐదేళ్లలో 4గురు సీఎంలు మారడం, ఢిల్లీలో అధిష్టాన నిర్ణయానుసారం, సీఎంలు ఎన్నుకోబడిన సాంప్రదాయం, కాంగ్రెసు ప్రతిష్టనుదిగజార్చడం జరిగింది. ఈ క్రమంలోనే 1982 మార్చి 21న హైదరాబాద్ కు చేరి, మార్చి 29 సాయంత్రం, రాజకీయ పార్టీని స్థాపించ నున్నట్లు ప్రకటించి, “తెలుగుదేశం” అని పేరు ఖాయం చేశారు.
తన “చేవ్రోలెట్” కారునే “చైతన్య రథం”గా మార్పించి, దానిపై నలు మూలలా ఆంధ్రదేశ మంతటా పర్యటించి, ప్రచారం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో, ప్రజల మనోభావాలను ప్రభావితం చేసి “ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఆత్మగౌరవ పునరుద్ధరణ” పార్టీ లక్ష్యమని చాటి, ఎన్నికల బరిలో దిగి సర్వం తానే అయి, ప్రజాకర్షణతో, ఉద్వేగ భరితంగా, ఉద్రేక పూరితంగా ప్రసంగాలతో ప్రజా మద్దతు పొందారు. 1983 జనవరి 7న ప్రకటిత శాసన సభ ఫలితాలలో, 199 స్థానాలను సునాయాసంగా గెలుచుకొని, 97 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు బ్రేక్ వేయ గలిగారు. టిడిపి వ్యవస్థాపక నేతలలో ఒకరైన నాదెండ్ల భాస్కర్ రావు, 1986 ఆగస్టు 16న, నాటి దేశ ప్రధాని ఇందిర, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ రాంలాల్ సహకారంతో, ఎన్టీఆర్ ను పడవీచ్యుతుని గావించి, అధికారం హస్తగతం చేసుకోగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ ఫలితంగా, సెప్టెంబర్ 16న తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్(NTR) తిరిగి ముఖ్యమంత్రి అయినారు.
ఎన్టీఆర్ ఎందరో ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు రాజకీయ జీవితాలను ప్రసాదించారు. విడిపోయిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, దివంగత ఎన్టీఆర్ మంత్రివర్గంలో పని చేసిన వారే కావడం విశేషం. 1985 జూన్ 1న శాసన మండలి రద్దు, హుస్సేన్ సాగర్ కట్టపై ప్రసిద్ధుల విగ్రహాల ఏర్పాట్లు, సినిమా థియేటర్లకు స్లాబ్ విధానం, 1989 లో మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి, కొత్త మంత్రి మండలి ఏర్పాటు, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర, రెండు రూపాయల కిలో బియ్యం పథకం, సంపూర్ణ మద్య నిషేధం, స్త్రీలకు ఆస్తిలో వాటా 1991 నంద్యాలలో గౌరవ సూచకంగా, నాటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు పోటీ పెట్టక పోవడం, 1989… 1994 మధ్య ప్రతిపక్ష పార్టీ నేతగా వ్యవహరించడం, 1993లో లక్ష్మీపార్వతిని వివాహ మాడటం, ఆమె సహచర్యం, తారకరాముని రాజకీయ ప్రస్థానంలో, ముఖ్యాతి ముఖ్య అంశాలుగా మిగిలాయి.
No comment allowed please