Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

Phone Tapping Case : తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) నిందితుడు శ్రవణ్‌ రావు సిట్‌ విచారణకు హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన… జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాలకు పారిపోయిన శ్రవణ్ రావు… బెయిల్ కోసం సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. శ్రవణ్ రావు పిటీషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం… విచారణకు సహకరించాలని ఆదేశించింది. అంతేకాదు ఆయన్ను అరెస్టు చేయొద్దని పోలీసులకు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌ రావు… విచారణ కోసం సిట్ ముందు హాజరుకావడం ఉత్కంఠగా మారింది.

Phone Tapping Case Updates

గతేడాది మార్చి 10న పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైన వెంటనే శ్రవణ్ రావు తొలుత లండన్‌కు… అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్‌ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే పోలీసులు ఆయనపై రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసారు. తనకు ముందస్తు బెయిల్‌ ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ… ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. దానిపై ఈనెల 24న జరిగిన విచారణలో అరెస్ట్‌ చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అందుకు పిటిషనర్‌ న్యాయవాది అంగీకరిస్తూ.. అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్‌కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే 72 గంటల గడువు విధిస్తూ శనివారం తమ వద్దకు విచారణకు రావాలని సిట్‌ స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనానికి హామీ ఇచ్చినట్లుగా శ్రవణ్‌రావు విచారణకు హాజరయ్యారు.

ఫోన్‌​ ట్యాపింగ్‌ వ్యవహారంలో… స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్‌ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌ రావులు నడుచుకున్నారనేది సిట్ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చారని… కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారుల ఎదుట శ్రవణ్ రావు చెప్పిన సమాచారం… అటు నిందితులు, ఇటు బీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

Also Read : Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్‌ లలో భారీ భూకంపం ! 150 మందికి పైగా మృతి !

Leave A Reply

Your Email Id will not be published!