PM Modi Meet : యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో ద్వైపాక్షిక సంబంధాలపై భేటీ

అలాగే వారిద్దరి సమావేశంపై ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు...

PM Modi : రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ఇంటిలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. భారత్-యూఎస్ మధ్య స్నేహసంబంధాలను పెంపొందించే పలు కీలక అంశాలపై చర్చించారు. యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటిలిజెన్స్‌గా తులసి గబ్బర్డ్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ(PM Modi)తో ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇంటిలిజెన్స్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తులసి గబ్బర్డ్‌కు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. అలాగే వారిద్దరి సమావేశంపై ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

PM Modi Meet..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇవాళ సాయంత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా.. ఇటీవల అక్రమ వలసల వ్యవహారం, హెచ్‌1బీ వీసాల అంశం, టారిఫ్‌లపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రధాని మోదీ.. డొనాల్డ్ ట్రంప్ గెస్ట్ హౌస్ అయిన బ్లెయిర్ హౌస్‌‌లో బస చేస్తున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రవాస భారతీయులను ప్రధాని మోదీ పలకరించారు. బ్లెయిర్ హౌస్‌ వద్ద ప్రవాసులు ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. కాగా, తన స్వాగతానికి వచ్చిన ప్రవాసులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : PM Narendra Modi : ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రత్యేక బహుమానం అందించిన భారత ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!