PM Modi : బీహార్ లో ఈ నెల 24న పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోదీ
ఈ సభకు సుమారు 5 లక్షల మంది రైతులు హాజరుకానున్నారు...
PM Modi : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఫిబ్రవరి 24న భాగల్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొంటారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది రైతులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి 19వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ప్రధాని విడుదల చేస్తారు.
PM Modi will Announce
ప్రధాని పర్యటన వివరాలను బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తెలియజేస్తూ, ప్రధాని సభలో భాగల్‌పూర్, ముంగెర్, బెగుసరాయ్ సహా 13 జిల్లాలకు చెందిన ప్రజలు, సీనియర్ ఎన్డీయే నేతలు పాల్గొంటారని చెప్పారు. త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన ఎన్డీయే కూటమి, డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ప్రధాని మోదీ, నితీష్ కుమార్ నాయకత్వం తమకు అఖండ విజయం అందిస్తుందన్నారు. ”ఢిల్లీ తరహాలోనే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము గెలుస్తాం” అని చెప్పారు.
కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రభావం బీహార్ ఎన్నికలపై ఉండదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదన్నారు. ”బీజేపీని ప్రజలు ఇప్పుడే గుర్తించారు. వాళ్లెలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? మేము (ఆర్జేడీ) ఇక్కడ ఉండగా బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది?” అని ప్రశ్నించారు. 243 నియోజవర్గాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి.
Also Read : 6.5 కోట్ల మంది ‘ఈపీఎఫ్‌వో’ చందాదారులకు శుభవార్త చెప్పిన సర్కార్