PM Narendra Modi: ప్రమాణ స్వీకారం తరువాత మోదీ తొలి విదేశీ పర్యటన ! ఎక్కడికంటే ?

ప్రమాణ స్వీకారం తరువాత మోదీ తొలి విదేశీ పర్యటన ! ఎక్కడికంటే ?

PM Narendra Modi: ముచ్చటగా మూడో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీ ఈ వారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో జూన్‌ 13-15 తేదీల్లో జీ7 దేశాల సదస్సు జరగనుంది. అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్‌, ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, జపాన్‌, కెనడా ప్రధానులు ఫుమియో కిషిదా, జస్టిన్‌ ట్రూడో తదితర నేతలు దీనికి హాజరుకానున్నారు. ఈ సమావేశం నిమిత్తం జూన్‌ 13న ప్రధాని మోదీ(PM Narendra Modi) ఇటలీ వెళ్లి… 14వ తేదీ రాత్రికి తిరిగి స్వదేశానికి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ప్రధాని నరేంద్ర మోదీ వెంట కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ తదితర ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం. సదస్సులో భాగంగా పలువురు ప్రపంచ నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. అయితే దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ కెనడా ప్రధాని ట్రూడోతో ముఖాముఖీ భేటీ ఉంటుందా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

PM Narendra Modi 1st Tour

గతేడాది జపాన్‌లోని హిరోషిమా వేదికగా జరిగిన జీ7 దేశాల సదస్సుకు మోదీ(PM Narendra Modi) హాజరైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ప్రపంచ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఈ ఏడాది కూడా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో పాటు గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం అంశాలపై నేతలు చర్చలు జరిపే అవకాశాలున్నాయి. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వార్షిక సమావేశానికి భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది.

Also Read : Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!