PM Narendra Modi: ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ కీలక భేటీ
ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ కీలక భేటీ
పహాల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ… జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ భేటీలో ఉగ్రదాడి, పాకిస్తాన్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ… వరస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అరేబియా సముద్రంలోని సరిహద్దులతోపాటు పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో భేటీ కావడంతో ఉత్కంఠ రేపుతోంది.
సైనికులకు ఆయుధాలు సరఫరా చేసే ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి సెలవులు రద్దు
ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్ లోని జబల్‌పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రతతోపాటు ప్రస్తుత కీలక సమయంలోని నిర్వహణ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రపుర్ జిల్లా కర్మాగారం అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని, ఆ లోటును భర్తీ చేయడానికే దీర్ఘకాల సెలవులను తక్షణం రద్దు చేస్తున్నట్లు ఖమరియా ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి సందర్భంగా 26 మంది మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉందనేందుకు బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వాటిని ప్రపంచం ముందు ఉంచింది. అంతేకాకుండా.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. అలాగే బారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైతం వివిధ నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారాయి. ఇక పాకిస్థాన్ అయితే.. భారత్ ఏ క్షణమైనా తమ దేశంపై దాడి చేస్తుందనే భయాందోళనతో ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు కావడం.. దాయాది దేశం పాక్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.