PM Narendra Modi: జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన !
జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన !
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై నెల మొదట్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. బహుశా జులై 8న ఇది ఉండవచ్చని, తేదీ ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పలు అంశాలపై ప్రధాని విస్తృతస్థాయి చర్చలు జరిపే అవకాశముంది. మాస్కో సందర్శన కార్యరూపం దాల్చితే గత అయిదేళ్లలో ఇది ప్రధాని మోదీ(PM Narendra Modi)కి తొలి రష్యా పర్యటన అవుతుంది. ఇంతకు మునుపు 2019లో రష్యాలోని వ్లాడవాస్టాక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ పర్యటనకు సంబంధించి భారత్ వైపు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇద్దరు అగ్రనేతల భేటీకి క్రియాశీలక సన్నాహాలను తాము అపుడే ప్రారంభించినట్లు మాస్కోలోని క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి.
PM Narendra Modi Visit
‘‘భారత ప్రధాని రాకకు మేము సిద్ధమవుతున్నట్లు నేను నిర్ధారించగలను. అయితే, పర్యటన తేదీని అపుడే చెప్పలేము. ఈ విషయం ఉభయులూ తర్వాత ప్రకటిస్తారు’’ అని రష్యా అధ్యక్షుడి సహాయకుడైన యూరి ఉషకోఫ్ మీడియాకు వివరించారు. జులై 3, 4 తేదీల్లో కజఖ్‌స్థాన్‌లో జరగనున్న షాంఘై సదస్సు (ఎస్‌సీవో)కు గైర్హాజరు కావాలని మోదీ నిర్ణయించుకొన్న నేపథ్యంలో క్రెమ్లిన్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. అలాగే అక్టోబరు నెలలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) వార్షిక సదస్సుకు రష్యా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతారని రష్యాకు పూర్తి విశ్వాసం ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారులు తెలిపారు.
ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇప్పటిదాకా రష్యా, భారత్ ల నడుమ 21 సార్లు వార్షిక భేటీలు జరిగాయి. చివరిసారిగా 2021 డిసెంబరు 6న ఢిల్లీ వేదికగా పుతిన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. మోదీ(PM Narendra Modi) పర్యటన ఖరారైతే మూడేళ్ల విరామం అనంతరం ఇరు దేశాల మధ్య 22వ వార్షిక సమావేశం జరుగుతుంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించే విషయాన్ని కూడా పుతిన్ తో మోదీ చర్చించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ముగిసిపోవాలని భారత్ ఆది నుంచీ కోరుకుంటున్నా, మాస్కోతో ద్వైపాక్షిక స్నేహబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోడానికి సిద్ధంగా లేనందునే ఉక్రెయిన్‌పై దాడిని ఇప్పటిదాకా ఖండించలేదు. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెబుతూ వస్తోంది.
Also Read : Rohit Sharma : భారత కెప్టెన్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆస్ట్రేలియా క్రికెటర్