Prakash Raj: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్ !
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్ !
Prakash Raj: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజు స్పందించారు. తాను చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని… ముందుగా తన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు.. ప్రస్తుతం తాను షూటింగ్‌లో భాగంగా విదేశాల్లో ఉన్నానని… ఈ నెల 30 తరువాత మీరు వేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని ప్రకాశ్ రాజు(Prakash Raj) స్పష్టం చేశారు. ఈ గ్యాప్‌లో ముందుగా నా ట్వీట్‌ను చూసి అర్థం చేసుకోవాలంటూ సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.
Prakash Raj – ప్రకాశ్ రాజ్ పోస్ట్ సారాంశమిదే !
‘డియర్ పవన్ కల్యాణ్ గారూ.. మీ ప్రెస్ మీట్ చూశాను.. నేను చెప్పింది ఏంటి… మీరు తప్పుగా అర్థం చేసుకుని చెబుతున్నదేంటి… నేను విదేశాల్లో షూటింగ్ చేస్తున్నాను. మీ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి 30వ తేదీ తర్వాత తిరిగి వస్తాను. ఇంతలో మీరు ముందుగా నా ట్వీట్‌ని చూసి అర్థం చేసుకొండి ప్లీజ్..’ అంటూ ప్రకాశ్ రాజు(Prakash Raj) ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.
అసలు వివాదం ఏంటి ?
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని ఉపయోగించారనే అంశం దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది. హిందూ వాదులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. ‘తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపినట్లు గుర్తించినందుకు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
కానీ, ఇది దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలను వెలికితీస్తుంది. మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా సహా అన్ని వ్యవస్థల్లో చర్చ జరగాలి. ‘సనాతన ధర్మాన్ని’ ఏ రూపంలోనైనా అపవిత్రం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగ పోరాడేందుకు మనమందరం కలిసి రావాలని నేను భావిస్తున్నాను.’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పవన్ కల్యాణ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
పవన్ పోస్ట్ కు స్పందించిన ప్రకాశ్ రాజ్(Prakash Raj)… కీలక వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారు. ‘డియర్ పవన్ కల్యాణ్.. మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఒక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరిపించండి. నిందితులను పట్టుకోండి. కఠినమైన చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. సమస్యను జాతీయ వ్యాప్తంగా ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో చాలా మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి’ అని ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హాయాంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాపై విమర్శలు కాదు.. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతేంటి? లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోంది. ఇటువంటి సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. సెక్యులరిజం అనేది టూ వే ప్రోసెస్. కాని హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు కూడా మాట్లాడకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. నేను ఇస్లాం, క్రిస్టియానిటీ జోలికి వెళ్ళానా. నా హిందూ మతాన్ని కించపరిచనప్పుడు మాట్లాడకూడదా అని ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు. ఆయన ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా… విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
Also Read : Special Investigation Team: తిరుమల లడ్డూ వివాదంపై సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ !