President Murmu : ఆగస్టు 5 నుంచి విదేశాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అనంతరం ఆగస్ట్ 7న రాష్ట్రపతి ముర్ము న్యూజిలాండ్ చేరుకుంటారు...
President Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తిమూర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. తొలుత ఆగస్ట్ 5వ తేదీన ఫిజీకి ఆమె చేరుకుంటారు. ఈ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు విలియమ్ కటోనివెరేతోపాటు ఆ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకాతో జరిపే దైపాక్షిక చర్చల్లో రాష్ట్రపతి ముర్ము(President Murmu) పాల్గొంటారు. ఫిజీ పార్లమెంట్లో ఆ దేశ సభ్యులనుద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. ఆ దేశంలో స్థిరపడిన భారతీయ సంతతితో రాష్ట్రపతి ముర్ము సమావేశం కానున్నారు. ఫిజీని సందర్శిస్తున్న తొలి భారత రాష్ట్రపతి ముర్మునే కానున్నారు.
President Murmu…
అనంతరం ఆగస్ట్ 7న రాష్ట్రపతి ముర్ము న్యూజిలాండ్ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ గవర్నర్ జనరల్ సిండి కైరో, ప్రధాని క్రిస్టఫర్ లక్సన్తో రాష్ట్రపతి ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక న్యూజిలాండ్‌లో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సదస్సులో సైతం ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత.. ఆ దేశంలో స్థిరపడిన భారతీయులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ కానున్నారు. ఆగస్టు 10న తూర్పు తిమూరుకు రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా, ప్రధాని క్సానానా గుస్మావోతో ఆమె సమావేశమవుతారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read : Supreme Court of India: సుప్రీంకోర్టులో నీతీశ్‌కు ఎదురుదెబ్బ !