PSR Anjaneyulu : ఐపీఎస్ పీఎస్ఆర్ కు అస్వస్థత..విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఐపీఎస్ అధికారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు...

PSR Anjaneyulu : ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. హై బీపీ, హృద్రోగ సమస్యతో పీఎస్సార్(PSR Anjaneyulu) బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఐపీఎస్ అధికారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

IPS PSR Anjaneyulu Hospitilised

ఏపీపీఎస్సీ పరీక్ష మూల్యాంకనం అవకతవకల కేసులో పీఎస్సార్(PSR Anjaneyulu) అరెస్ట్ అయి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్‌ వేయగా నిరాశే ఎదురైంది. దీంతో హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అనారోగ్య సమస్యలుంటే కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంటే రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందే విధంగా అనుమతి పొందవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈరోజు ఉదయం జిల్లా జైలులో హైబీపీ, గుండె సంబంధిత సమస్యతో పీఎస్సార్ ఇబ్బంది పడుతున్నట్లు సిబ్బంది తెలియజేయడంతో అప్రమత్తమైన జైలు అధికారులు స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సిఫార్సు చేయడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుండె సంబంధిత వైద్యులు ఆయనకు పరీక్ష చేస్తున్నారు.

పది రోజుల క్రితం జైలులో ఇదే విధంగా పీఎస్సార్ అనారోగ్యంతో ఇబ్బంది పడటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో సేవలిందించారు. రెండు రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పినప్పటికీ వినకుండా నేరుగా జిల్లా జైలుకు వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. తిరిగి ఈరోజు అదే సమస్య పునరావృతం అవడంతో ఆందోళన చెందిన జైలు సిబ్బంది వెంటనే ప్రభుత్వాస్పత్రికి పీఎస్సార్‌ను తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సాయంత్రం వరకు చికిత్స కొనసాగిన తర్వాత పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల నివేదికను బట్టి జిల్లా జైలు అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఎస్సార్‌ను ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.

Also Read : Journalist KSN : భారీ బందోబస్తుతో జర్నలిస్ట్ కొమ్మినేని మంగళగిరి కోర్టుకు

Leave A Reply

Your Email Id will not be published!