Punjab Police : డ్రగ్స్ పై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం
డ్రగ్స్ పై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం
Punjab Police : మాదక ద్రవ్యాల నియంత్రణ దిశగా సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్(Punjab) ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూడు నెలల్లో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటూ సీఎం భగవంత్ మాన్ పిలుపు మేరకు… పోలీసులు పెద్ద ఎత్తున చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా శనివారం దాదాపు 12 వేలమంది సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 750కుపైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 8 కిలోలకుపైగా హెరాయిన్, 16 వేలకుపైగా మత్తు మాత్రలు, గంజాయి ఇతరత్రా స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 232 కేసులు నమోదు చేసి, 290 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు… డ్రగ్స్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన కేబినెట్ ఉపసంఘం శనివారం తొలి సమావేశాన్ని నిర్వహించింది.
Punjab Police Special Drive
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మాదకద్రవ్యాల నిరోధక కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మంత్రి అమన్ అరోడా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇది ఒక పార్టీకో, ప్రభుత్వానికో చెందిన సమస్య కాదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాజకీయాలు మానుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో సామాజిక సంస్థలు, ఎన్జీవోలు ప్రభుత్వంతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
మరోవైపు.. కేబినెట్ ఉపసంఘం భేటీ అనంతరం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా మాట్లాడుతూ… మాదకద్రవ్యాలపై ఆప్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఒక్క డ్రగ్ పెడ్లర్ కూడా కనిపించబోరని తెలిపారు. పోలీసు చర్యలను పర్యవేక్షించేందుకు కేబినెట్ ఉపసంఘం సభ్యులకు వివిధ జిల్లాలను కేటాయించినట్లు తెలిపారు.
Also Read : Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో 46 మంది సేఫ్ ! నలుగురు మృతి !