Pushpak Express : మహారాష్ట్ర జల్గావ్ జిల్లా వద్ద ఘోర రైలు ప్రమాదం..12 మంది మృతి

అది విని కంగారు పడ్డ ప్రయాణికులు చైన్‌ లాగారు...

Pushpak Express : మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా పరందా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోరం జరిగింది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌(Pushpak Express) రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు బోగీకి నిప్పంటుకుందనే వదంతులతో కిందకు దూకారు. అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 35 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఓ బాలుడు, ముగ్గురు మహిళలున్నారు. ఈ ఘటనపై జల్గావ్‌ ఎస్పీ డాక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన అందజేసిన వివరాల ప్రకారం.. జల్గావ్‌ నుంచి బయలుదేరిన పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌(Pushpak Express) సాయంత్రం 5 గంటల సమయంలో పరందా స్టేషన్‌ సమీపానికి రాగానే.. జనరల్‌ బోగీ చక్రాల వద్ద నిప్పురవ్వలు వచ్చి, పొగ రేగింది. దీంతో.. ఓ ప్రయాణికుడు ‘‘బోగీకి నిప్పంటుకుంది’’ అంటూ అరిచాడు.

అది విని కంగారు పడ్డ ప్రయాణికులు చైన్‌ లాగారు. రైలు ఆగడంతో సుమారు 50 మంది ప్రయాణికులు రైలులోంచి కిందకు దిగారు. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌(Pushpak Express) సరిగ్గా ఓ భారీ కల్వర్టు వద్ద ఆగడంతో.. ఒకవైపు సేఫ్టీవాల్‌, లోయను తలపించే కాలువ.. మరోవైపు రెండో ట్రాక్‌ ఉన్నాయి. దీంతో.. ప్రయాణికులు ట్రాక్‌ ఉన్న వైపు దిగి.. నిప్పురవ్వలు వచ్చిన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ.. అక్కడే నిలబడ్డారు. అంతలో మృత్యుశకటంగా కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ వారు నిలబడ్డ ట్రాక్‌ వైపు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చింది. ప్రయాణికులు తేరుకుని, పక్కకు తప్పుకొనేలోపే.. ట్రాక్‌పై ఉన్నవారిని ఢీకొంటూ.. వారిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పదేళ్ల వయసున్న ఓ బాలుడితోపాటు.. ముగ్గురు మహిళలున్నారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.

Pushpak Express Accident Update

మిగతావారు జరిగిన దారుణాన్ని అర్థం చేసుకునేలోపు.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు మృతదేహాల చేతులు, కాళ్లు తెగి.. రక్తపు ముద్దలు ట్రాక్‌పై దర్శనమిస్తూ.. బీభత్సమైన దృశ్యాలు కనిపించాయి. పోలీసులు కూడా తొలుత 11 మంది మృతిచెందారని భావించారు. అయితే.. ఆస్పత్రిలో శరీర భాగాలను మృతదేహాల వారీగా జతచేయగా.. 12 మంది చనిపోయినట్లు తేలిందని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి వివరించారు. క్షతగాత్రులను పచోరాలోని బృందావన్‌ ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

సంఘటనాస్థలిని జల్గావ్‌ ఎంపీ స్మితావాఘ్‌, మాజీ ఎంపీ ఉన్మేశ్‌పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ ఆయుష్‌ ప్రసాద్‌, ఐజీ దత్తాత్రేయ కరాలే సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదమేమీ జరగలేదని, కేవలం వదంతులతోనే దారుణం జరిగిందన్నారు. మృతులంతా జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నవారేనని వివరించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘ఘటన సమాచారం అందగానే ఎనిమిది అంబులెన్స్‌లను పంపించాం. మంత్రి గిరీశ్‌ మహాజన్‌, ఇతర అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. మహారాష్ట్ర సర్కారు తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు.

Also Read : CM Revanth-Davos Tour : 45వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న రేవంత్ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!