Rahul Gandhi Comment : రాహుల్ చొరవకు హ్యాట్సాఫ్
కార్మికులకు ఆర్థిక భద్రత
Rahul Gandhi Comment : సమున్నత భారత దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగాలలో రేయింబవళ్లు పని చేస్తున్నారు. చాలా పరిశ్రమలు ఉన్నా వారికి ఈ దేశపు చట్టాలు వర్తించవు. కార్మిక శాఖ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇవాళ మార్కెట్ మాయాజాలం భారతీయ మార్కెట్ ను శాసిస్తోంది. చిన్న పాటి వస్తువుల నుంచి రోజూ వాడే ప్రతి వస్తువుకు వ్యాపారస్తులు, కార్పొరేట్ కంపెనీలే ధరలు నిర్ణయిస్తున్నాయి. పీవీ పుణ్యమా అని ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినా వాటి వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది ప్రజలకు. సామాన్యులు, పేదలు, అత్యంత నిరుపేదలు, మధ్య తరగతి జీవులు కోట్లాది మంది నిరంతరం బతుకుతో యుద్దం చేస్తున్నారు. బతికేందుకు నానా తంటాలు పడుతున్నారు. నిత్యం నరక యాతన అనుభవిస్తున్నారు. క్వారీలలో, ఇతర ప్రమాదకర రంగాలలో చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల దాకా తమ రక్తాన్ని ధార పోస్తున్నారు.
Rahul Gandhi Comment Viral
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులేవీ వారికి వర్తించవు. వారంతా అనుమాకులు, చరిత్రకు అందని వాళ్లు. కేవలం జనాభా లెక్కల్లోకి మాత్రం ఎన్నికలప్పుడు గుర్తుకు వస్తారు. ఆ తర్వాత కనుమరుగై పోతారు. కారణం వారికంటూ హక్కులుండవు..బాధ్యతలు ఉంటాయి. కార్మిక చట్టం ప్రకారం కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. కానీ 14 గంటల నుండి 18 గంటల దాకా నిరంతరం పనుల్లోనే తాము గడుపుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం చెప్పు కోవడానికి గుర్తింపు కార్డులు కూడా ఉండవు. ఎందుకంటే ఆ కార్డులు ఉంటే అన్నీ ఇవ్వాల్సి వస్తుంది.
కంపెనీలు, కాంట్రాక్టర్లు జవాబుదారీ వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ కార్మికులు చౌకగా దొరుకుతారో అక్కడ ఎంఎన్సీ కంపెనీలు వాలి పోతాయి. కాకమ్మ కబుర్లు చెబుతాయి. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మరథం పడతాయి. పేదలకు చెందిన భూములను దారదత్తం చేస్తాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పుడు నిర్వీర్యమై పోయాయి. ఎందుకంటే ప్రభుత్వం వాటి నుంచి తప్పుకుంటోంది. చాలా వాటిని అమ్మేసింది. ఇంకొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఏకంగా విక్రయించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాని పేరు డిజిన్వెస్ట్మెంట్ అన్నమాట.
ఈ సమయంలో ప్రధానంగా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి. ఎందుకంటే ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా అన్ని రంగాలకు చెందిన కార్మికులను కలుసుకున్నారు. వారి గోడును విన్నారు. వారి బాధలు చూసిన రాహుల్ గాంధీ ఒకానొక సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇందు కోసం ఆయన ఓ ప్రతిపాదన చేశారు. అసంఘటిత రంగంలో కానీ లేదా ఇతర ఏ కంపెనీలలో, ఇతర రంగాలలో పని చేస్తున్న కార్మికులకు ఆర్థిక భద్రత ఉండాలని స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించారు. పార్టీ లో తీర్మానం కూడా చేశారు. దేశంలోనే తొలి సారిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజస్తాన్ ప్రభుత్వం లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక భద్రత కల్పించే చట్టాన్ని తీసుకు వచ్చింది. దీనికి ప్రధాన కారకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). దీని వల్ల వారికి ఉద్యోగ , పని భద్రత లేక పోవచ్చు..కానీ ఆర్థిక భద్రత చేకూరుతుంది. దీని వల్ల కనీసం ఆత్మ గౌరవంతో బతికే వెసులు బాటు కలుగుతుంది..ఈ సందర్బంగా రాహుల్ గాంధీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..కదూ..
Also Read : Team India New Jersy : భారత జట్టుకు కొత్త జెర్సీ