Rahul Gandhi: నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది – రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణ

నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది - రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణ

Rahul Gandhi: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణ చేసారు. ఇదే విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తెలియజేశారని వెల్లడించారు. లోక్‌ సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొంతమందికి నచ్చలేదని రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు.

Rahul Gandhi Comment

‘‘సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా ‘చక్రవ్యూహం’ ప్రసంగం నచ్చలేదు. నాపై సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తెలిపారు. వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

కేంద్ర బడ్జెట్‌ 2024-25పై లోక్‌ సభలో జరుగుతున్న చర్చలో భాగంగా సోమవారం రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులపై విమర్శలు సంధించారు. ‘‘అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో… ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశమని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశాన్ని బంధించిన చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్నారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్‌ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

Also Read : Chikun Gunya: తమిళనాడును వణికిస్తున్న చికున్‌ గున్యా !

Leave A Reply

Your Email Id will not be published!