MP Vijayasai Reddy : సంచలన నిర్ణయం తీసుకున్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి
డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదన్న విజయసాయిరెడ్డి..
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. శనివారం(జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదన్న విజయసాయిరెడ్డి(Vijayasai Reddy), ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం అంటూ పేర్కొన్నారు.
MP Vijayasai Reddy Shocking Decision
నాలుగుదశాబ్దాలుగా, మూడు తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు విజయసాయిరెడ్డి. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఇక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన పేర్కొన్నారు.
దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా విభేదించానన్న విజయసాయిరెడ్డి(Vijayasai Reddy), చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తు వ్యవసాయం అన్న విజయసాయిరెడ్డి, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇటీవలే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభకు ముగ్గురు రాజీనామా చేశారు. ఆర్.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ తమ పదవులు వదులుకున్నారు. ఇప్పుడు రాజీనామా బాటలో విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఏడుగురికి తగ్గిపోతోంది వైసీపీ బలం. మరోవైపు, అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా చేస్తే 6కే వైసీపీ పరిమితం కానుంది. వీళ్లిద్దరు రాజీనామా చేస్తే కూటమి పార్టీలకే రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి.
Also Read : CM Revanth Reddy : కేంద్రమంత్రికి 20 లక్షల ఇళ్లు కావాలంటూ వినతి ఇచ్చిన సీఎం