Rakesh Tikait : కేంద్రానికి టికాయత్ డెడ్ లైన్
అరెస్ట్ చేయక పోతే ఆందోళన
Rakesh Tikait : బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait) నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ కు డెడ్ లైన్ విధించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎస్కేయూ ఆధ్వర్యంలో మహా పంచాయత్ నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ కు డెడ్ లైన్ విధించారు. ఈనెల 9 లోపు భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని లేక పోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కేంద్రం కావాలని నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ఎందుకని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఓ వైపు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు తాము లైంగికంగా, మానసికంగా, శారీరకంగా తీవ్ర వేధింపులకు గురైనట్లు స్వయంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. కానీ మొదట ఢిల్లీ ఖాకీలు కేసు నమోదు చేయలేదని చివరకు సీజేఐ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటేనే కానీ దిగి వచ్చారంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎక్కడా చూడలేదన్నారు.
ఇప్పటికే రైతుల సత్తా అంటే ఏమిటో మోదీకి ఆచరణాత్మకంగా తెలిసి వచ్చిందని, ఇక నుంచైనా మహిళా రెజ్లర్ల ఆవేదనను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. తాము రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ముందు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను చీఫ్ పదవి నుంచి తొలగించాలని, ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read : Ashok Gehlot