రాష్ట్రంలో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ది శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్ష కూడా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కళలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు. డాక్టర్ నటరాజ రామకృష్ట శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంత్రి ఆర్కే రోజా పోస్టర్ , కరపత్రాలను ఆవిష్కరించారు.
ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఏపీలోని తుమ్మలపల్లి కళా క్షేత్రం వేదికగా ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి వెల్లడించారు. కళాకారిణిగా ఇప్పటికే గుర్తింపు పొందిన మంత్రి సాంస్కృతిక కార్యక్రమాలను విరివిగా చేపడుతూ వస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు.
అంతే కాకుండా కళాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. యువ నాయకుడు, ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున అన్ని రంగాలకు చెందిన కళాకారులను గుర్తించి గౌరవించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.