RS Praveen Kumar : కేసు ఎత్తివేత‌పై కుల ప్ర‌భావం – ఆర్ఎస్పీ

హ‌ర‌గోపాల్ కు ఒక నీతి కాశీంకు ఒక నీతి

RS Praveen Kumar : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం కేసీఆర్ అనుస‌రిస్తున్న ద్వంద విధానాల‌ను తూర్పార‌బట్టారు. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) హ‌ర‌గోపాల్ పై కేసు ఎత్తి వేయ‌డం వెనుక ఉన్న ఒత్తిళ్ల‌ను, కుల ఆధిప‌త్య భావ‌జాలాన్ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్బంగా ప్రొఫెస‌ర్లుగా ప‌ని చేసిన హ‌ర‌గోపాల్ ను , కాశీంను ప్ర‌స్తావించారు. ఇద్ద‌రూ విశ్వ విద్యాల‌యాల అధ్యాప‌కులే. ఇద్ద‌రిపై ఒకే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఒకే కేసు న‌మోదైంది.

ఆ చ‌ట్టం ఉపా. దేశ ద్రోహంకు సంబంధించిన కేసు. ఇద్ద‌రూ తాము న‌మ్మిన సిద్దాంతం కోసం ప‌ని చేస్తున్న వారే..కానీ ఇద్ద‌రి కులాలు వేర‌ని పేర్కొన్నారు. ఒక‌రిది అణిచి వేయ‌బ‌డిన కులం ఎస్సీ. మ‌రొక‌రిది ఆధిప‌త్య బ్రాహ్మ‌ణ కుల‌మ‌ని మండిప‌డ్డారు. ఇద్ద‌రి ప‌ట్ల రాజ్యం ప్ర‌వ‌ర్తించిన తీరును ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. ఒక‌రి ఇంటిని ఖాకీలు చుట్టుముట్టారు..బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లారు. కానీ హ‌ర‌గోపాల్ ఇంటిని పోలీసులు తాక‌లేద‌ని గుర్తు చేశారు. ఉపా కేసులో అరెస్టైన కాశీం నాలుగు నెల‌ల పాటు జైలు జీవితం గ‌డిపార‌ని గుర్తు చేశారు ఆర్ఎస్పీ. కాశీంపై కేసు న‌మోదైతే క‌మ్యూనిస్టులతో పాటు ఏ రాజ‌కీయ పార్టీ నేత నోరు విప్ప‌లేదు.

ఒక్క మంద‌క్రిష్ణ మాదిగ ఒక్క‌డే త‌న స్వ‌రాన్ని వినిపించాడు. కానీ హ‌ర‌గోపాల్ మీద కేసు పెడితే స్వ‌యంగా సీఎం స్పందించాడ‌ని దీని వెనుక మ‌ర్మం ఏంటో తెలుసు కోవాల‌న్నారు ఆర్ఎస్పీ . కులానికో న్యాయ‌మ‌ని మ‌రోసారి రుజువైంద‌న్నారు. మ‌ను వాదం కుల‌త‌త్వం అంటే ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. కాశీం ఒక్క‌డే కాదు ఆదివాసీ నాయ‌కుడు సోయం చిన్న‌య్య లాంటి ఎంద‌రో పీడిత ప్ర‌జ‌లు ఉపా చ‌ట్టం కింద న‌లిగి పోతున్నార‌ని ఆవేద‌న చెందారు బీఎస్పీ చీఫ్‌.

Also Read : Nara Lokesh : విద్యకు ప్రాధాన్యం అభివృద్దికి సోపానం

 

Leave A Reply

Your Email Id will not be published!