Russia-Ukraine War : రష్యా చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుందా..?
రష్యా అదుపులో ఇంకా 10 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అంచనా...
Russia-Ukraine War : ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఉక్రెయిన్‌కి చెందిన ఓ సైనికుడి(యుద్ధ ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగలించి అమ్ముతోందని ఆమె ఆరోపించింది. రష్యా చేతిలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు స్వదేశానికి తిరిగి వచ్చాక మృతదేహాల్లో కీలక అవయవాలు కనిపించలేదని ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా పేర్కొన్నారు. రష్యా దురాగతాలకు ఇది పరాకాష్ట అన్నారు. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. తమ బలగాలపై ఉక్రెయిన్ అనవసర ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు.
Russia-Ukraine War…
రష్యా అదుపులో ఇంకా 10 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అంచనా. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ – రష్యా(Russia) యుద్ధం ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది. టర్కీలోని అంకారాలో యుద్ధ ఖైదీల కుటుంబాల ప్రతినిధులు, టర్కీలోని ఉక్రేనియన్ రాయబారి వాసిల్ బోడ్నార్తో జరిగిన సమావేశంలో సలేవా ఈ ఆరోపణలు చేశారు. ” జైళ్లలో ఉక్రెయిన్ సైనికులను హింసించి చాలా మందిని చంపేశారు. మృతదేహాలను ఉక్రెయిన్‌కి చేర్చారు. శరీరభాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా.. అవయవాలు దొంగిలించారని గుర్తించాం. ఇది దారుణం. రష్యా.. అవయవాలు దొంగతనం చేయడంలో బ్లాక్ మార్కెట్‌గా అవతరించింది.
ఉక్రెయిన్(Ukraine) ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసి చంపి.. వారి అవయవాలతో వ్యాపారం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలి” అని సలేవా కోరారు. ఉక్రేనియన్, రష్యన్ చెరలో ఉన్న సైనికుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి స్వతంత్ర వైద్య కమిషన్ ఏర్పాటు చేయాలని.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు సలేవా విజ్ఞప్తి చేశారు. రష్యా చెరలో బంధీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని, రోజు రోజుకీ వారి ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ సైనికుడి తల్లి చెప్పింది. ప్రపంచ దేశాలు ఈ అంశంపై గళమెత్తాలని కోరింది. వారికి మెరుగైన చికిత్స అందజేయాలని డిమాండ్ చేసింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లపైనే అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రెండు దేశాలు పరస్పర దాడులతో ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిస్తే, ఈ యుద్ధాన్ని ముగిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే పేర్కొన్నారు. ఈ మేరకు తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Also Read : Nara Lokesh: బడికెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ – మంత్రి నారా లోకేశ్