Delhi Hospital Fire: ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం ! ఏడుగురు నవజాత శిశువులు మృతి !
ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం ! ఏడుగురు నవజాత శిశువులు మృతి !
Delhi Hospital Fire: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని వివేక్ విహార్ లో ఉన్న చిల్డ్రన్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి చికిత్స అందుతోంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అగ్నిమాపక సిబ్బంది వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేసింది. అయితే, మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ఘటనాస్థలంలో అనేక సవాళ్లు ఎదురైనట్లు తెలుస్తోంది. జనమంతా గుమిగూడి… వీడియోలు తీసేందుకు ఎగబడటంతో సహాయక చర్యలకు విఘాతం కలిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా… నీటి లభ్యత లేకపోవడం, తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు ఉండటం కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగించినట్లు తెలిపాయి.
వివేక్ విహార్‌లోని పిల్లల ఆస్పత్రిలో శనివారం రాత్రి 11.30 సమయంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. మొత్తం 12 మంది నవజాత శిశువులను హాస్పిటల్ వెనుక కిటికీలోంచి బయటకు తీసుకొచ్చాం. వారిలో ఏడుగురు మృతిచెందారు. మరో అయిదుగురు చికిత్స పొందుతున్నారు’’ అని ఆసపత్రి అధికారులు తెలిపారు. ఆస్పత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ల పేలుడుతో మంటలు మరింత వేగంగా వ్యాపించినట్లు వెల్లడించారు. ఘటనాస్థలంలో నాలుగైదు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఆ సిలిండర్లు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న ఓ భవనంలోని బొటిక్, ప్రైవేట్ బ్యాంకుకు, మరో భవనంలోని కళ్లద్దాల షోరూమ్, ఓ దుకాణానికీ వ్యాపించాయి. ఒక స్కూటర్, అంబులెన్స్, సమీపంలోని పార్క్‌లో కొంతభాగం మంటల్లో చిక్కుకుపోయాయి.
Delhi Hospital Fire – నవజాత శిశువుల మృతికి ప్రధాని మోదీ సంతాపం
‘‘ఢిల్లీ(Delhi)లోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. ఈ కష్టసమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా సంతాప సందేశాన్ని తెలియజేసారు. మరోవైపు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తోపాటు ఎల్జీ వీకే సక్సేనాలు ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.
మరో ఘటనలో ఢిల్లీ(Delhi)లోని షహదారా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఓ నివాస భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో గేమింగ్ జోన్‌లో చెలరేగిన మంటల్లో 27 మంది ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి తేరుకోకముందే ఢిల్లీలో నవజాత శిశువుల మరణం ఆందోళనకరం.
Also Read : PV Sindhu : మలేసియా మాస్టర్స్ లో ఫైనల్ కి చేరిన పీవీ సింధు