Sheikh Hasina : బంగ్లాలో హిందువుల ఊచకోతల సూత్రధారి యూనస్ పై భగ్గుమన్న హసీనా
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై లక్షిత హింసాకాండను పదవీచ్యుతురాలైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) ఖండించారు. ఈ హింసాకాండ వెనుక తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు గుప్పించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్ తరహాలో షేక్ హసీనా పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాకాండతో గత ఆగస్టు 5న షేక్ హసీనా(Sheikh Hasina) దేశం విడిచిపెట్టారు.
Sheikh Hasina Slams Mohammed Yunas
బంగ్లాదేశ్‌లో అప్రతిహతంగా హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న సామూహిక హత్యల వెనుక యూనుస్ ఉన్నారని, స్టూడెంట్ కోఆర్డినేటర్లతో కలిసి ఆ దాడులకు ఆయన ప్లాన్ చేశారని షేక్ హసీనా చెప్పారు. హిందూ సాధువు చిన్నయ్ కృష్ణదాస్ అరెస్టుతో బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొన్న నేపథ్యంలో షేక్ హసీనా వ్యాఖ్యలు ప్రాధాన్యత సందరించుకున్నాయి. బంగ్లాదేశ్‌లో హత్యాకాండలు కొనసాగితే తాత్కాలిక ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాధించదని ఖలేదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్ చేసిన వ్యాఖ్యలను కూడా షేక్ హసీనా తాజాగా ప్రస్తావించారు. ”సామూహిక హత్యాకాండకు నేను బాధ్యులని ఆరోపించారు. నిజానికి సామూహిక హత్యాకాండలను యూనుస్ ప్రోత్సహిస్తున్నారనేది వాస్తవం. స్టూడెంట్ కోఆర్డినేటర్లతో కలిసి వ్యూహం ప్రకారం సామూహిక హత్యలకు ఆయన పాల్పడుతున్నారు. వాళ్లే ఈ ఊచకోతల ప్రధాన సూత్రధారులు” అని అన్నారు.
తాను ఎందుకు దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో షేక్ హసీనా పునరుద్ఘాటిస్తూ, తాను దేశం విడిచిపెట్టకుండా ఉంటే దారుణమైన ఊచకోతలు జరిగేవని, వాటిని నివారించేందుకే తాను దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందని, తనకు అధికారం లెక్కకాదని చెప్పారు. గణ భవన్ వద్ద భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారన్నారు. అది తనకు ఇష్టం లేకపోయిందని వివరించారు. తన తండ్రి, బంగబంధు ముజిబుర్ రెహ్మాన్‌ను చంపినట్టే సాయుధ మూక బంగభవన్ (ప్రధాన నివాసం)పై విరుచుకుపడి తనను కూడా హత్య చేసేవారని అన్నారు. కేవలం 25 నుంచి 30 నిమిషాల్లో తాను ఆ ప్రదేశాన్ని ఖాళీ చేశానని, ఎవరిపైనా కాల్పులు జరపవద్దని తన భద్రతా సిబ్బందికి చెప్పానని తెలిపారు.
Also Read : RBI : 2000 నోట్లపై ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సంచలన అప్డేట్