Singer Sirisha : సంగీతం నా ప్రాణం – నేపథ్య గాయని కావటమే లక్ష్యం
Singer Sirisha :సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్ షో గ్రాండ్ ప్రీమియర్‌కు చేరుకుంది.
Singer Sirisha : సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్ షో గ్రాండ్ ప్రీమియర్‌కు చేరుకుంది. డిసెంబర్ 19, 20వ తేదీలో సోని టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ గ్రాండ్ ప్రిమియర్ షో సందడిగా జరగనుంది. ఇందులోని టాప్ 15 కంటెస్టెంట్స్ ట్రోఫీ కోసం ఒకరితో ఒకరూ పోటీ పడుతూ తమ గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు, షో జడ్జిలైన విశాల్ దాద్లానీ, నేహా కక్కర్, హిమేష్ రేష్మియాలు పోటీదారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు అమ్మాయిలు సైతం అమ అద్భుత స్వర మాధుర్యంతో పోటీదారులను సైతం మెప్పించి జడ్జీల ప్రశంసలతో పాటు ఐడెల్‌లో గోల్డెన్ మైకులు గెలుచుకుని ఔరా అనిపించుకున్నారు. ఇలా గోలడ్డెన్ మైక్ గెలుచుకుని ప్రధాన పోటీదారుగా ఎదిగిన మన విశాఖ సాగర తీర సంగీత ఝురి శిరీష భగవతుల తో ప్రత్యేక ఇంటర్వూ..
మీ సంగీత ప్రయాణం ఎలా ఆరంభమైంది?
మా కుటుంబంలో అంతా పాటలు పాడేవాళ్లే, అమ్మ, నాన్న పాడతారు. కీబోర్డుతో సహా చాలా సంగీత పరికరాలు వాళ్లు వాయించగలరు. ఎవ్వరు దీనిని ప్రొఫషనల్ గా తీసుకోలేదు, అయితే మా తాతగారు భాగవతుల కృష్ణారావుగారు మాత్రం జనసంద్రాన్ని మేలు కొలిపే పాటలు, నాటకాలు పద్యాలు రాసేవారు. కర్ణుడు లాంటి పాత్రలు ధరించేవారు. ఆయన ప్రభావం మా మీద ఉందనే చెప్తాను. ఎందకంటే ఆయన తన పద్యాలతో పాటు అనేక విషయాలు నాకు మా అక్కకి నేర్పించారు. పద్య అంత్యాక్షరి ప్రయోగం కూడా పాటల వైపు నన్ను పంపిందేమో. నేను మూడున్నరేళ్ల సమయంలోనే నేను పాడుతున్న పాటలు విని ఆనందించేవారు. మా అక్కతో కలసి పాటలు పాడేదాన్ని, ఆమెతోనే కర్ణాటక మ్యూజిక్ నేర్చుకునేందుకు క్లాసులకు వెళ్లేదాన్ని.
టివి షోలవైపు ఎలా వచ్చారు?
మొదటి సారి టివి షొలలొ మాటీవిలో బాలుగారి పాడాలని ఉంది కార్యక్రమంలో పాల్గొన్నాను. మా తాతగారు రాసిన పాట పాడాను బాలూగారు ఎంత మెచ్చుకున్నారో మర్చిపోలేను ఆపై విన్నర్ గా ఈ జర్నీ ఆరంభమైంది. ఆపై జీతెలుగులో సరిగమపలో, సూపర్ సింగర్స్ పాడాను. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తమిళ సూపర్ సింగర్ లో పాడాను. ఆ షోకి వచ్చిన సంగీత దర్శకుడు రెహమాన్ తన విజిల్ సినిమాలో పాడేందుకు అవకాశం ఇచ్చారు.
ఇలా పాటల కోసం తిరుగుతుంటే చదువుకి ఇబ్బంది కలగలేదా?
లేదండీ చిన్నప్పటి నుంచి నేను చదువుకు సత్యసాయి విద్యా నికేతన్, విశాఖ యాజమాన్యం చాలా సహకరించింది. వారి ప్రోత్సాహంతోనే టివిలలో పాడే అవకాశం అందుకున్నా. అలా అని నేను ఎప్పుడూ సంగీతం కోసం చదువుని నిర్లక్ష్యం చేయలేదు. నారాయణ కాలేజ్‌లో ఇంటర్ చదివా… వారి ప్రోత్సాహం ఉండేది. అయితే ఇంజనీరింగ్ విజయనగరం మహారాజ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివేటైమ్‌లో… తొలి ఏడాది తెలుగు సూపర్ సింగర్, నాలుగో ఏడాది తమిళ సూపర్ సింగర్ కాంపిటేషన్‌లో పాల్గొనాల్సి వచ్చింది. అప్పుడు మా హెచ్ వోడి నగేష్ సర్ సంగీతాభిమాని కావటం , నా చిన్నప్పుడు నే పాడిన ప్రోగ్రామ్స్ చూసి ఉండటం వల్ల ఆయన చాలా హెల్ప్ చేసారు. ఓవైపు కాంపిటేషన్‌కోసం ప్రాక్టీస్ చేయటం, చెన్నై వెళ్ల పాల్గొనటం తిరిగి వెనువెంటనే పరీక్షలకు హాజరవ్వటం ఇబ్బందే అయినా నగేష్ సార్ మద్దతు అంతా ఇంతా కాదు. అందువల్లే ఇంజనీరింగ్ పూర్తి చేయటమే కాదు నా కృష్టికి గోల్డ్ మెడల్ కూడా సంపాదించా.
ఐడెల్ వైపు అడుగులు ఎలా పడ్డాయి?
నాకు మొదటి నుంచి సంగీతం అంటే ప్రాణం అని చెప్పాగా. ఐడెల్ ఆడిషన్లు జరుగుతున్నట్టు సమాచారం తెలియగానే చాలా ఎంగ్జయిటీగా ఫీలయ్యా. అన్‌లైన్‌లో జరిగిన ఎంపిక విధానంలో నేను కూడా ఎంపిక అయ్యా. ఈ విషయం తెలిసాక నేనే కాదు మా కుటుంబం కూడా ఆనందం అంతా ఇంతా కాదు.
గోల్డెన్ మైక్ గెలుచుకున్నారుగా? ఎలా ఫీలవుతున్నారు?
నిజమే చాలా టఫ్ కాంపిటేషన్‌లో టాప్ 15 నిలవటం చాలా ఆనందంగా ఉంది. అందునా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో పాడుతున్నారు. ఎవరి జోనల్‌లో వారు బెస్ట్, అన్నిరకాల పాటలు పాడగల సత్తా ఉన్నవారే. అయితే కాంపిటేషన్ అన్నది నేను నాతోనే పోటీ పడుతున్నా నాతోటివారికి ఇచ్చే సలహాల నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నా.
ఐడెల్‌లో మీరు ఏపాటతో న్యాయ నిర్ణేతలని మెప్పించారు?
నా తొలి పాట బాలూగారి పాడిన సాత్వాతొలియా సాఖియా. దీన్ని ఎస్‌పిబి గారికి సెల్యూట్ చేసి సమర్పించాను. ఈ పాటకి దాదాపు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ప్రేక్షకులు నన్నెంత ప్రోత్సహిస్తున్నారో అర్ధమైంది. తరువాత అడుగులే కన్నానులే… పాట ఉమేష్‌గారితో సహా అంతా మెచ్చుకుని గోల్డెన్ మైక్ అందించారు. ఇది మర్చిపోనిది.
మీతో నే మీరు పోటీ అవుతున్నారంటె ఎలా?
అవును సార్! నా గొంతు చిత్రగారికి సారూప్యంగా ఉందని జడ్జీలు చెపుతుండటం ఉత్సాహాన్ని ఇచ్చేందే. ఐనా ఇప్పటికన్నా ఇంకా బెటర్‌గా పాడాలని అనుకుంటా. ఇందుకు తగ్గట్టే ఇక్కడ మేం పాడుతున్న విధానం గమనించి లోటుపాట్లు సరిచేసే సంగీత నిపుణులు, కోచ్‌లు మేం ఏ పాట ఎలా పాడాలి అన్న విధానం చాలా నేర్పిస్తారు. ఆ బృందం పర్యవేక్షణలో పలు విషయాలు తెలుసుకుంటున్నా… వాటిని నాలో ఆకళింపు చేసుకుని నా పద్దతిలో పాడి మెప్పించే ప్రయత్నం చేస్తున్నా…. ఎందుకంటే చాలా మంది నేను పడుతున్న పాటలపై మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు . మిత్రులు, సన్నిహితులు పంపుతున్న మెసేజ్‌లు మరింత ఉత్సాహం ఇస్తున్నాయి. వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానియకుండా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది కదా?
మీ కుటుంబం నుంచి మద్దతు ఎలా ఉంది? ఐడెల్‌లో మీతో పాటు ఎవరుంటున్నారు
ముంబైలో నేనొక్కదాన్నిఉంటున్నా.. అయినా నిత్యం నాతో టచ్‌లోనే ఉంటున్నారు. నేను ఇంట్లో వాల్లని మిస్ అవుతున్నానని సోనీ టీవి వాళ్లే లైవ్ కాల్‌లో పాడించారు.
మీ అక్క సూచనలెలా ఉంటాయి?
ఇక అక్క మద్దతు అంతా ఇంతా కాదు. ఏ పాట పాడాలని నేననుకున్నా ముందు వినిపించేది అక్కకే, నేను, అక్క ఇద్దరం పాడాలని ఉంది పాడినోళ్లమే కదా? అందునా ఇద్దరం కలిపి పాడినా ఒకే గొంతులా వినిపిస్తుంది. అది నాకు ప్లస్ అయ్యింది. నేనే ఎలా పాడితే బాగుంటుంది అన్నది అక్కకి బాగా తెలుసు. ఎలాంటి పాటలెంచుకున్నా… ఆ పాట విని ఆమె చేసే సూచనలు నాకెంతో సహకరిస్తోంది.
సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు ఎలా ఉంది?
చాలా మంది సపోర్టు చేస్తున్నారు. నేను తమిళంలో కూడా పాడాను కనుక రెండు ఇండస్ట్రీల నుంచి మద్దతు చాలా బాగా వస్తోంది. నిత్య సంతోషిణి గారు, శ్వేతా మోహన్‌గారు. ఉషాగారు, ఇలా ంతా నన్ను అభినందిస్తూ, మద్దతు ఇస్తు మెసేజ్ ఇస్తున్నారు.
జడ్జీల సపోర్టు ఎలా ఉంది?
మేం ఈ స్టేజ్‌కి వస్తామోలేదో తెలియని పరిస్థితి నుంచి వచ్చినోళ్లం కదా? జడ్జీలు ప్రతి పాటని, ప్రతిగాయకుడు పాడుతున్న విధానాన్ని నిశితంగా గమనిస్తూ అనేక సూచనలు కూడా చేస్తు అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
ఐడెల్ లో విజేత ఎలా కాగలరనుకుంటున్నారు?
నా లక్ష్యం ఐడెల్ లో విజేత కావాలని. నేను కర్ణాటక సంగీతంతో పాటు వెస్ట్రన్ కూడా నేర్చుకున్నాను. అన్ని రకాల పాటలు పాడి అందర్నీ మెప్పించగల నన్న నమ్మకం నాకుంది.
భవిష్యత్‌లో సినీ సంగీత సంద్రంలో మీ ప్రయాణం ఎటు?
దీని తరువాత అదే ప్రయత్నం నాది. శిరీష ఇంతవరకు ఇండస్ట్రీలో పాటలు పాడినా ప్రత్యేకంగా నా గొంతుకు ఐడెంటీ రాలేదు. మంచి నేపధ్యగాయని కావాలనే నా లక్ష్యం. నాకు భాషలు నేర్చుకోవటం అంటే చాలా ఇష్టం. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలు వచ్చు. మ్యూజిక్ అంటే ఒకే భాష అని నమ్మకం నాది. అవకాశాలు ఎక్కడొచ్చినా పాడాలన్నదే నా కోరిక.
ఇంజనీరింగ్ చదివారుగా… మరి ఉద్యోగ ప్రయత్నం చేయలేదా?
అహ్మదాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ సంగీతం కోసం నేను చెన్నై వచ్చాను. అవకాశం చెన్నైలో వచ్చిఉంటే ఎలా ఉండేదో కానీ, రెండుపడవల ప్రయాణం అంటే ఆరేడు గంటలు ఉద్యోగం చేసి, తిరిగి సంగీతం అంటే చాలా కష్టం, సంగీత మంటేనే నాకు ఇష్టం. ఇరవైనాలుగంటలూ సంగీతంలో గడపడమే నాకు ఆనందాన్నిస్తుంది. అందుకే ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు.
ఆల్‌ది బెస్ట్ శిరీష…
ఇంటర్వూ : ఎం. రామ్‌గోపాల్, జర్నలిస్టు, హైదరాబాద్
No comment allowed please