Delhi Coaching Center Tragedy: ఢిల్లీ రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ వద్ద విద్యార్థుల ఆందోళన !
ఢిల్లీ రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ వద్ద విద్యార్థుల ఆందోళన !
Delhi Coaching Center Tragedy: సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్ కు తెలియజేశామని పేర్కొన్నారు. వారు వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi Coaching Center Tragedy…
ఘటనా స్థలానికి చేరుకున్న ఆప్ బహిష్కృత నేత, ఎంపీ స్వాతీ మాలీవాల్(MP Swati Maliwal) ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రమాదం జరిగి 12 గంటలు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. ఈ మరణాలు ప్రమాదం వల్ల జరిగినవి కాదని.. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భవనం బేస్ మెంట్‌లో ముగ్గురు విద్యార్థులే చిక్కుకున్నారా ? ఇంకా ఉన్నారా అనే విషయం తెలియరాలేదన్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న స్వాతీ మాలీవాల్ ను విద్యార్థులు అడ్డుకున్నారు. దీనిని రాజకీయం చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతీ మాలీవాల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఈ ఘటనపై ఢిల్లీ(Delhi) మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ… ‘‘ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, నేనూ ఇక్కడికి వచ్చాం. డ్రైనేజీ ఒక్క సారిగా పైకి ఉబికి వచ్చిందని స్థానికులు చెప్పారు. ఘటనపై విచారణ జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటాం. చట్టాలకు విరుద్ధంగా బేస్‌మెంట్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం’’ అని తెలిపారు.
ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా… ఢిల్లీ(Delhi) ప్రభుత్వంపై మండిపడ్డారు. డ్రెయిన్ లను శుభ్రం చేయాలని స్థానికులు పదేపదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ జల్ బోర్డు మంత్రి ఆతిశీ, దుర్గేష్ పాఠక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్ మెంట్‌లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులను తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా గుర్తించారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read : Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ !