Vijayawada floods: ప్రాణాలను సైతం లెక్కచేయక సాహసం !

ప్రాణాలను సైతం లెక్కచేయక సాహసం !

Vijayawada: చుట్టూ వరద బయటకు వెళ్లలేని స్థితి. రెండు రోజులుగా ఆకలి దప్పులు. ప్రభుత్వం రాదు.. ఆహారం ఇవ్వదు. కుటుంబం కోసమైనా కష్టాలను ఎదురీదాలి. ఎంతటి ముంపునైనా ఎదురించాలి. ఇదీ సింగ్‌నగర్‌లో సగటు జీవి బతుకుపోరు గాథ. సోమవారం సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ కింద కాలనీల్లో పీకల్లోతు నీళ్లు నిలిచే ఉన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు ఒక్క పడవ కూడా వెళ్లలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కుటుంబాలకు.. కుటుంబాలు కట్టుబట్టలతో మేడలు, మిద్దెలపై కాలం వెళ్లదీస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఆకలికి అలమటిస్తుంటే చూడలేక కుటుంబ సభ్యులు కర్రలు, ట్యూబులు, థర్మాకోల్‌ పెట్టెలు, నీటిలో తేలియాడే వస్తువుల సాయంతో ఫ్లైఓవర్‌పైకి చేరుకోవడానికి ప్రాణాలను సైతం లెక్కచేయక సాహసం చేస్తున్నారు.

Vijayawada – నాగాయలంకలో పడవ బోల్తా..

కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్‌ ఎదురుగా ఉన్న నది మధ్యలో సోమవారం ఉదయం పడవ బోల్తా పడి నలుగురు మత్స్యకారులు కృష్ణా నదిలో పడిపోయారు. వారిని వెంటనే తోటి మత్స్యకారులు రక్షించారు. వరద ఉధృతి తీవ్రం కావడంతో నదికి అవతలి వైపున్న లంక ప్రాంతంలో ఉన్న పడవను, మరో చిన్న బోట్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు నలుగురు మత్స్యకారులు మరో పడవలో బయలుదేరారు. ఈ క్రమంలో మత్స్యకారుల పడవ బోల్తాపడింది. దీంతో మత్స్యకారులు నది ప్రవాహ ఉధృతికి దిగువకు కొట్టుకెళ్లారు. ఘాట్‌ వద్ద ఉన్న మత్స్యకారులు ఇది గమనించి.. వెంటనే మూడు మోటారు బోట్‌లలో వెళ్లి నలుగురు మత్స్యకారులను రక్షించారు.

Also Read : Chandrababu Naidu: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!